నేనేం తినాలి? ఎలా తినాలి?
నేనొక మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నా. ఎక్కువ సమయం బయటే తిరగాలి. ఇలాంటప్పుడు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
నేనొక మార్కెటింగ్ సంస్థలో పనిచేస్తున్నా. ఎక్కువ సమయం బయటే తిరగాలి. ఇలాంటప్పుడు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రవళి, హైదరాబాద్
గంటల తరబడి ప్రయాణం, వెంటవెంటనే సమావేశాలతో సమయం దొరక్క చాలాసార్లు బయటి ఆహారాన్నే తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక రోజో లేదా ఒకట్రెండుసార్లో బయటి ఆహారం తీసుకుంటే సమస్య కాదు. ఎక్కువసార్లు లేదా రోజూ బయటే తినాల్సి వస్తే మాత్రం ఆహార శుభ్రతపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎక్కడ కొనుగోలు చేస్తున్నారు? వాళ్లు ఎలా తయారు చేస్తున్నారు? పరిసరాల శుభ్రత... వీటిపై దృష్టి పెట్టాలి. మరీ పచ్చిగా ఉండే ఆహార పదార్థాల జోలికి వెళ్లొద్దు. మాంసం, పాలు, గుడ్డుతో చేసిన పదార్థాలు, రోటి పచ్చళ్లు, సలాడ్లు... వంటివి త్వరగా పాడైపోతాయి. వాటిలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అలాంటి ఆహారాన్ని తింటే పొట్టలో ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీయొచ్చు. అపరిశుభ్ర పరిసరాల్లో తినడం వల్ల హెచ్ పైలోరి లాంటి ఇన్‌ఫెక్షన్స్, కడుపులో మంట, అల్సర్స్, అసిడిటీ ఉత్పన్నమవ్వొచ్చు. తినే ముందు చేతులను శుభ్రం చేసుకోవడం లేదా చెంచాతో తీసుకోవడం చేయాలి. శానిటైజర్‌ను వెంట ఉంచుకోవాలి.
రెండోది... జీవనశైలికి, దినచర్యకు అనుగుణంగా ఆహార ప్రణాళిక తయారుచేసుకోవాలి. ప్రయాణాల్లో తేలికైన, ఎక్కువ సేపు నిల్వ ఉండే లైట్ మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. భోజనం ఇంట్లోనే చేసి ఇడ్లీ, ఉప్మా, పెరుగన్నం, శాండ్‌విచ్‌లను లంచ్ కోసం తీసుకెళ్లొచ్చు. వేయించిన సెనగలు, బాదం, కాజూ లాంటివి తినొచ్చు. సోయా, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్స్ లాంటివి మధ్యమధ్య తీసుకోవచ్చు. టెట్రా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి. అయితే వాటి గడువు తేదీని చూడాలి. తీసుకునే ఆహారాల మధ్య ఎక్కువ విరామం లేకుండా చూసుకుంటే జీర్ణ సమస్యలు రావు. రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి వచ్చే వారు పండ్లనూ వెంట తీసుకువెళ్లొచ్చు. శుభ్రమైన నీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. టైమ్‌కి తినాలి... ఇవన్నీ పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.