రక్తస్రావం తగ్గడం లేదు..

నా వయసు 45. ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావమవుతోంది. అది కూడా ఎక్కువ రోజులు ఉంటోంది. నొప్పి వస్తోంది. ఇంతకుముందెప్పుడూ ఇలా లేదు.

Updated : 10 Oct 2021 06:04 IST

నా వయసు 45. ఇద్దరు పిల్లలు. కొన్నాళ్లుగా నెలసరి సమయంలో తీవ్ర రక్తస్రావమవుతోంది. అది కూడా ఎక్కువ రోజులు ఉంటోంది. నొప్పి వస్తోంది. ఇంతకుముందెప్పుడూ ఇలా లేదు. నీరసం, అలసటా ఉంటోంది. ఎందుకిలా అవుతోంది. పరిష్కారం చెప్పండి. 

- ఓ సోదరి

మీరు చెబుతోన్న లక్షణాలన్నీ అబ్‌నార్మల్‌ యుటరైన్ బ్లీడింగ్‌ (ఏయూబీ)ను సూచిస్తున్నాయి. ఇలా కావడానికి చాలా రకాల కారణాలుండొచ్చు. గర్భాశయం, హార్మోన్లు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఇలా జరగొచ్చు. గర్భాశయ లోపలి పొరలో వాపు (ఎండోమెట్రియల్‌ హైపర్‌ ప్లేసియా), పాలిప్స్‌, ఫైబ్రాయిడ్స్‌, ఎడినోమయోసిస్‌ వంటివి సాధారణ కారణాలు. నూటికి పది, పదిహేను మందిలో ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌ కూడా ఉండొచ్చు. హార్మోన్లకు సంబంధించి మెనోపాజ్‌ సమయంలో తరచుగా ఇలా జరగొచ్చు. కానీ, నొప్పి ఉండటం అసాధారణం. కారణమేంటో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు తప్పనిసరి. ఇందులో మొదటిది... అల్ట్రా సౌండ్‌ స్కాన్‌, ట్రాన్స్‌ వెజైనల్‌ స్కాన్‌(టీవీఎస్‌) చేయడం ద్వారా గర్భాశయం, అండాశయానికి సంబంధించిన సమస్యలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. రెండోది హిస్టెరోస్కోపీ. గర్భాశయం లోపలికి కెమెరా పంపించి లోపలి పొరని పరీక్షించి, బయాప్సీకి పంపిస్తారు. మిగిలిన రక్త, హార్మోన్ల పరీక్షలూ అవసరమే. వీటి ఫలితాల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాన్ని బట్టే చికిత్స ఉంటుంది.

చికిత్సలు... రకాలు..
మెనోపాజ్‌కు సంబంధించిన సమస్యలైతే హార్మోన్ల ద్వారా చికిత్స చేయొచ్చు. పాలిప్స్‌ ఉంటే వాటిని హిస్టెరోస్కోపీ ద్వారా తొలగించవచ్చు. అలాగే లోపలి పొరలో ఫైబ్రాయిడ్‌ గడ్డలున్నా కూడా ఒక పరిమాణం వరకు హిస్టెరోస్కోపీ  ద్వారా వాటిని తీసేయొచ్చు. ఎడినోమయోసిస్‌కు ప్రొజెస్టిరాన్‌ మాత్రలు లేదా ‘మెరీనా’ లూప్‌ ద్వారా చాలావరకు ఉపశమనం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం హిస్టరెక్టమీ ద్వారా గర్భాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులతో నయం కానప్పుడు, బయాప్సీలో క్యాన్సర్‌ ఉన్నా, క్యాన్సర్‌కి దారితీసే ఏటిపికల్‌ హైపర్‌ ప్లేసియా ఉన్నా హిస్టరెక్టమీని ఎంచుకుంటే మంచిది. మీరు ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్‌ను కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని