కాస్త ఎక్కువ తిన్నా వాంతవుతోంది
పాపకి పన్నెండేళ్లు. బరువు 50 కిలోలు. బొద్దుగా ఉంటుంది. సమస్య ఏంటంటే... మూడు పూటలా అన్నమే తింటుంది. అలాగే కాస్తంత ఎక్కువ తిన్నా వాంతైపోతుంది. మలబద్ధకం కూడా ఉంది. ఎందుకిలా జరుగుతోంది?
పాపకి పన్నెండేళ్లు. బరువు 50 కిలోలు. బొద్దుగా ఉంటుంది. సమస్య ఏంటంటే... మూడు పూటలా అన్నమే తింటుంది. అలాగే కాస్తంత ఎక్కువ తిన్నా వాంతైపోతుంది. మలబద్ధకం కూడా ఉంది. ఎందుకిలా జరుగుతోంది?
- భాగ్య, మెదక్
పిల్లల్లో చాలామంది టీవీనో, ఫోనో చూస్తూ తింటున్నారు. వారేం తింటున్నారో, ఎంత తింటున్నారో కూడా చూసుకోవడం లేదు. దాంతో కావాల్సిన దానికన్నా ఎక్కువగా తినేస్తుంటారు. తర్వాత ఆయాసం, పొట్ట భారంగా అనిపించడం మామూలే. మీ పాప ఎక్కువగా తినడానికి ఇవీ ఓ కారణం కావొచ్చు. మరో కారణం ఏమిటంటే... కొందరు చిన్నారుల్లో గ్యాస్ట్రో ఈసో ఫాగేల్ రిఫ్లెక్స్ డిసీజ్(జీఈఆర్డీ) అయి ఉండొచ్చు. దీనివల్ల ఏదైనా ఎక్కువ తిన్నా, తాగినా బయటకు వచ్చేస్తుంది. మరికొంతమంది చిన్నారులు బాడీ ఇమేజ్‌తో బాధపడుతుంటారు. ఆహారం తక్కువ తీసుకోవాలనుకుంటారు కానీ నియంత్రించుకోలేరు. ఆ తర్వాత దాన్ని బయటకు తెచ్చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదొక మానసిక సమస్య. మీ పాప కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతుండొచ్చు. ముందు తన ఇబ్బంది ఏమిటన్నది స్పష్టంగా కనుక్కోవాలి. దాన్ని బట్టే చికిత్స. కాబట్టి తనను వైద్య నిపుణుల వద్దకు తీసుకువెళ్లండి. తన వయసు, ఎత్తుకు తగిన బరువుందా లేదా ఎక్కువగా ఉందా అనేదీ కూడా చూసుకోవాలి.
మరో సమస్య...
ఆహారంలో తగినంత పీచు తీసుకోనప్పుడు మలబద్ధకం ఉత్పన్నమవుతుంది. తేలికగా జీర్ణమయ్యే ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే చిన్నారులు ఆసక్తి చూపుతారు. బ్రెడ్, పిజా, పాలిష్ చేసిన బియ్యం, ఇడ్లీలు, దోశలు... ఇలాంటివి తింటుంటారు. అలాగే అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్ అయిన బిస్కట్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇష్టపడతారు. దీనికి తోడు సరైన మోతాదులో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తిననప్పుడు మలబద్ధకం మొదలవుతుంది. రోజుకు కనీసం ఒకట్రెండు పూటలు... పొట్టు తీయని ధాన్యాలు (ఓట్స్, రాగులు, జొన్నలు ల్లాంటివి) వాడటం తప్పనిసరి చేయాలి. అంతేకాకుండా పొట్టుతో ఉన్న పప్పు దినుసులు (చోలే, రాజ్మా, సెనగలు, పెసలు, అలసందలు) వారి ఆహారంలో ఉండేలా చేయాలి. మొక్కజొన్నతో ఉండే పదార్థాలు కూడా పెట్టాలి. ఆకుకూరలు వాడేలా చూడాలి. ఆకుకూరలు, కూరగాయలు సరైన మోతాదులో తినిపించినప్పుడు ఈ సమస్య పిల్లల్లో ఉత్పన్నం కాదు. చిన్నారి తగినన్ని నీళ్లు తాగేలా చూడాలి.
సాధారణంగా చిన్నారులకు ఆహార పదార్థాలను కంటికింపుగా అలంకరించి ఇస్తే ఇష్టంగా తింటారు. క్యారెట్, కీర లాంటివి ఇవ్వడం, పండ్ల ముక్కలను తినమనడం, సూప్స్ అందించడం లాంటివి చేయాలి. కాబట్టి పాపకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేయాలి. అందుకోసం తన జీవనశైలిని తదనుగుణంగా మార్చాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.