అడిగి తప్పు చేశానా?
నిజంగా గమ్మత్తైన పరిస్థితి. సలహా ఇచ్చే ముందు.. ఉద్యోగ మార్పు సమయంలో పాటించాల్సిన సూత్రాల గురించి మాట్లాడు కుందాం. అవసరం తీరాక వంతెనను కాల్చకూడదన్న మాట విన్నారా? అంటే.. వెళ్లే సమయంలో మీ సీనియర్లతో బంధాన్ని చెడ గొట్టుకోవద్దు. ఇది ప్రాథమిక నియమం
ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నా. ఇంకా మంచి దానిలో అవకాశం వచ్చింది. ఏం చేయాలని మేనేజర్‌ని సలహా అడిగితే.. నిజం చెప్పి రాజీనామా చేయమన్నారు. చేసి మూడు నెలలవుతున్నా రిలీవ్ చేయడం లేదు. పైగా ఆ మేనేజరే రాజీనామా చేసేప్పుడు నిజం చెబుతారా అని తిరిగి నన్నే ప్రశ్నిస్తున్నాడు. కొత్త సంస్థలో చేరే సమయం దగ్గరపడుతోంది. ఆయన్ని అనవసరంగా అడిగాననిపిస్తోంది. నేనేం చేయాలి? పరిష్కారం చూపరా?
- సహస్ర, హైదరాబాద్
నిజంగా గమ్మత్తైన పరిస్థితి. సలహా ఇచ్చే ముందు.. ఉద్యోగ మార్పు సమయంలో పాటించాల్సిన సూత్రాల గురించి మాట్లాడు కుందాం. అవసరం తీరాక వంతెనను కాల్చకూడదన్న మాట విన్నారా? అంటే.. వెళ్లే సమయంలో మీ సీనియర్లతో బంధాన్ని చెడ గొట్టుకోవద్దు. ఇది ప్రాథమిక నియమం. ఇది సహనాన్నీ, పరిణతినీ ప్రదర్శించాల్సిన సమయం. భవిష్యత్‌లో కెరియర్ నిర్దేశంలో సీనియర్లే సాయపడతారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీడే విధానం సంస్థను బట్టి మారుతుంటుంది. కాబట్టి, గతంలో రాజీనామా చేసిన మీ సహోద్యోగులు ఎలా వ్యవహరించారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని ఆధారంగా వ్యూహాలను రచించుకోండి. నమ్మకంగా, శ్రేయోభిలాషిలా ప్రవర్తించిన మేనేజర్ ఒక్కసారిగా మాట మార్చడం వింతగానే అనిపిస్తోంది. అయినా సరే.. అతని ప్రవర్తనలో మార్పుల గురించి కారణాలు ఊహించుకుంటూ కూర్చోవద్దు. ముందున్న మార్గమేంటో మాత్రమే ఆలోచించండి. వర్క్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆయన మిమ్మల్ని రిలీవ్ చేయలేకపోతున్నారని నా అభిప్రాయం. మీ నోటీస్ పిరియడ్ పూర్తయితే తర్వాతి ప్రక్రియల గురించి నేరుగా హెచ్‌ఆర్‌ను కలవండి. మీ మేనేజర్‌నూ ప్రత్యేకంగా కలిసి నోటీస్ పిరియడ్, ఇతర ప్రక్రియలూ పూర్తయిన విషయం తెలిపి, రిలీవ్ చేయమని కోరండి. అతను మిమ్మల్నీ, మీ మాటనీ దాటేస్తుంటే మర్యాద చూపిస్తూనే పట్టుదలగా ఉండండి. జ్ఞానంతోపాటు పరిపక్వతను ప్రదర్శించడమే మీ ముందున్న ఏకైక మార్గం. అతని తీరుపై సహోద్యోగులతో మాత్రం చర్చించకండి. అనవసర వదంతులకు తావిచ్చినట్టు అవుతుంది. మీ లక్ష్యం గౌరవంగా సంస్థను వదలడమవ్వాలి. ఒత్తిడిగా భావిస్తే తప్పులు చేసే ప్రమాదముంటుంది. ఓపికగా ప్రయత్నిస్తే అలాంటి వాటికి ఆస్కారముండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.