అక్క భర్తకి నేను నచ్చానట...

మా అక్కకు ఈమధ్యే పెళ్లైంది. బావ చూడటానికి బాగుంటాడు. నేనంటే చాలా అభిమానం చూపిస్తున్నాడు. ముందు చూసుంటే.. అందంగా, సరిజోడిలా ఉన్న నన్నే చేసుకునే వాడట. ఇప్పటికైనా మించి పోయింది లేదు, దూరంగా

Updated : 24 Oct 2021 06:20 IST

మా అక్కకు ఈమధ్యే పెళ్లైంది. బావ చూడటానికి బాగుంటాడు. నేనంటే చాలా అభిమానం చూపిస్తున్నాడు. ముందు చూసుంటే.. అందంగా, సరిజోడిలా ఉన్న నన్నే చేసుకునే వాడట. ఇప్పటికైనా మించి పోయింది లేదు, దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. ఇదంతా చెబితే మావాళ్లు నన్ను అపార్థం చేసుకుంటారని భయంగా ఉంది.

- ఓ సోదరి, మంగళగిరి

స్త్రీలను తమవైపు మళ్లించుకోవడానికి కొందరు ఇలాగే ప్రేమ కబుర్లు వల్లిస్తారు. మాయమాటలు, పొగడ్తలతో ప్రలోభపెడ్తారు. దాంతో వీళ్లూ ఆకర్షితులవుతారు. అన్నీ ఆలోచించే కదా పెళ్లి చేసుకుంటారు. మీ బావ ఇప్పుడు వక్రబుద్ధి చూపుతున్నాడంటే రేపు మీ కంటే అందమైన పిల్ల కనిపిస్తే అటు మళ్లుతాడు. అతనికి మనసు నిలకడ, పెళ్లి పట్ల విలువ, నమ్మకం లేవని అర్థమవుతోంది. ఏది అందంగా కనిపిస్తే దాన్ని సొంతం చేసుకోవాలనే తత్వం కనిపిస్తోంది. ఆ మాటలు నమ్మితే మీకు అనర్థమే. అందరూ మిమ్మల్నే తప్పు పడతారు. అక్కాబావలు తల్లిదండ్రులతో సమానమని గుర్తుచేయండి. ‘అక్కతో పెళ్లయింది, తనతోనే నీ జీవితం, నేను వచ్చే ప్రసక్తి లేదు, అమ్మానాన్నా చూసినతన్నే చేసుకుంటాను’ అని స్పష్టంగా చెప్పండి. అప్పుడతను మీమీద ఆశలు పెట్టుకోడు. మీకూ అటువైపు మనసు మళ్లదు. అయినా మారకపోతే మీ వాళ్లతో ఈ విషయం చెప్పడం మంచిది. మీ చదువూ లేదా ఉద్యోగం మీద ధ్యాస పెట్టండి. ఇలాంటి వ్యక్తులు మీతో కాకపోతే ఇంకెవరితోనైనా ఇలాగే చేస్తారు. ఇది మీ అక్కా బావల జీవితం, వాళ్లు నిర్ణయించుకోవాలి. అందులో మీ పాత్ర ఉండకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని