సైజ్ పెరిగితే ప్రమాదమా!
మెదడులోని లేటరల్ వెంట్రికిల్స్‌లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్‌ఎఫ్) ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండి, వెంట్రికిల్స్ పరిమాణం పెరిగితే ఆ పరిస్థితిని ‘హైడ్రోసెఫలిస్’ అంటారు. మీ డాక్టర్ చెప్పినట్లుగా 15 మి.మీ. దాటితే
నాకు ఎనిమిదో నెల. ఈ మధ్యే స్కానింగ్ చేసి లేటరల్ వెంట్రికిల్స్ డయామీటర్ ఎక్కువగా (దాదాపు 11 మి.మీ.) ఉందని చెప్పారు. అది 15 మి.మీ. దాకా పెరిగితే సమస్య ఇంకా పెరుగుతుందన్నారు. ఇలా ఉంటే సహజ ప్రసవం కష్టమని చెబుతున్నారు. నాకిది మొదటి కాన్పు. చాలా ఒత్తిడిగా అనిపిస్తోంది. పెరగకుండా ఉండేందుకు ఏమైనా నివారణ చర్యలు తీసుకోవచ్చా?
- ఓ సోదరి
మెదడులోని లేటరల్ వెంట్రికిల్స్‌లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ (సీఎస్‌ఎఫ్) ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండి, వెంట్రికిల్స్ పరిమాణం పెరిగితే ఆ పరిస్థితిని ‘హైడ్రోసెఫలిస్’ అంటారు. మీ డాక్టర్ చెప్పినట్లుగా 15 మి.మీ. దాటితే కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఇది రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరిలో మాత్రమే కనిపిస్తుంది. దీనికి అత్యంత సాధారణ కారణం ‘ఆక్విడక్టల్ స్టినోసిస్’... అంటే సీఎస్‌ఎఫ్ ప్రవహించే మార్గంలో అడ్డంకులు ఉండటం లేదా సీఎస్‌ఎఫ్ మార్గం చాలా సన్నగా ఉండి ఫ్లూయిడ్ సరిగా ప్రవహించే అవకాశం లేకపోవడం. ‘జెనెటిక్ డిఫెక్ట్స్’, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, శిశువు మెదడులో గడ్డలు, మెదడులో పదార్థం సరిగా పెరగకపోవడం లేదా రక్తస్రావమవడం.. ఇవన్నీ మిగిలిన కారణాలు కావొచ్చు. అందుకని తప్పని సరిగా శిశువు అనాటమీని సునిశితంగా, అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షించి వెన్నెముక, దానిలోని స్పైనల్ కెనాల్ అంతా బాగుందో లేదో చూసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు, జెనెటిక్ సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేయాలి. ఒకవేళ హైడ్రోసెఫలిస్ మరీ పెద్దగా ఉంటే సహజ ప్రసవ అవకాశాలు చాలా తక్కువ. తల మరీ పెద్దగా ఉంటే సిజేరియన్ ద్వారా కాన్పు చేయాల్సి రావొచ్చు. ఒకవేళ నెలలు నిండకుండా కాన్పు జరిగినా లేదా తల పరిమాణం మరీ పెద్దగా లేకపోయినా నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు.
బిడ్డ సంగతి కొస్తే.. సాధారణంగా మెదడు ఎదుగుదల బాగానే ఉంటుంది. ఒకవేళ వెన్నెముకలో ‘స్పైనా బైఫిడా’ సమస్య ఉంటే తప్పని సరిగా ఆర్థోపెడిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ స్పెషలిస్టులను సంప్రదించాలి. పుట్టిన బిడ్డకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ అవసరమవుతుంది. బిడ్డ నడవగలదా లేదా అనేది న్యూరల్ ట్యూబ్‌లో సమస్య ఎంత ఎత్తులో ఉందన్న దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ సలహాలు, సూచనలు పాటించండి. మందులు, ఆహారం ద్వారా దీంట్లో మార్పులు తీసుకురాలేం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.