ఏం చేసినా బరువు తగ్గడం లేదు

నాకు 27. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. లావుగా ఉంటాను. రోజూ గంట తప్పనిసరిగా నడుస్తాను. అలాగే డైట్‌ కూడా పాటిస్తున్నా. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. ఏం చేస్తే బరువు తగ్గుతాను?

Updated : 16 Sep 2022 11:00 IST

నాకు 27. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిని. లావుగా ఉంటాను. రోజూ గంట తప్పనిసరిగా నడుస్తాను. అలాగే డైట్‌ కూడా పాటిస్తున్నా. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. ఏం చేస్తే బరువు తగ్గుతాను?

- శ్రీ విజయ, ఇ-మెయిల్‌

ఒక వ్యక్తి బరువు, శరీర ఆకృతి, నిర్మాణం అనేవి వారి తాతలు, తండ్రులు వారి ఆహార అలవాట్లు, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి... వీటన్నింటి మీద ఆధారపడతాయి..ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇంత ఎత్తుకు ఇంత బరువు అనే కొలమానం ఉంటుంది. అయితే మారుతున్న జీవనశైలిలో భాగంగా శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. దాంతో ఎక్కువ మంది అధిక బరువు సమస్యకు గురవుతున్నారు.

బరువు ఎప్పుడు తగ్గుతుందంటే.. ఒక వ్యక్తి ఎత్తు, శరీర నిర్మాణంలో కొవ్వు, కండ శాతాలు ఎంతెంత ఉన్నాయో...తను ఎంత శారీరక శ్రమ చేస్తున్నాడు... దీన్ని బట్టి రోజుకు అవసరమయ్యే కెలొరీలు/ఆహారం ఆధారపడుతుంది. అవసరమైనదానికంటే దాదాపు 500 కెలొరీలు తక్కువగా తీసుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా బరువు తగ్గుతారు.

శక్తి వినియోగాన్ని బట్టే...  మీ ఎత్తూ, బరువు వివరాలు ఇవ్వలేదు. ఎక్కువ గంటలు కదలకుండా కూర్చొనే ఉంటున్నారు కాబట్టి మీరు చేసే గంట వ్యాయామం ఉన్న బరువును పెరగకుండా చూస్తుంది. కానీ దాన్ని తగ్గించడానికి కాదు. మీరెన్ని గంటలు పని చేస్తున్నారు. ఎంత సమయం నిద్రపోతున్నారు... ఏయే పనులకు శక్తిని వినియోగిస్తున్నారు అనేది రోజూ తరచి చూసుకోవాలి. అవసరాన్ని బట్టి శారీరక శ్రమ ఉండేలా వ్యాయామ ప్రణాళికలు వేసుకోవాలి. వేగవంతమైన కసరత్తులను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. నూనెపదార్థాలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, తాజా పండ్లు (దానిమ్మ, పుచ్చకాయ, కర్బూజ), కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి.

రోజులో ఎన్ని అడుగులు వేస్తున్నారు... దాన్ని బట్టి ఎన్ని కెలొరీలు ఖర్చవుతున్నాయి.. లాంటివి లెక్క చూసుకునేందుకు, పేడోమీటర్‌, మొబైల్స్‌లో కొన్ని రకాల యాప్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటినీ ఉపయోగించుకోవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం అది శాస్త్రీయ విధానంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ముందుగా మీరోసారి పోషకాహార నిపుణులను సంప్రదించండి. వారి సలహాలు, సూచనలతో ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని