నా సమస్యకు పరిష్కారం ఉందా?
నా వయసు 29. పెళ్లై ఐదేళ్లు. ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల ఓపెన్ మయోమిక్టమీ చేశారు. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మూడుసార్లు ఐయూఐ విఫలమైంది. ఐవీఎఫ్‌లో అండాలను రిట్రీవ్ చేస్తే ఒక్కటీ ఆరోగ్యకరమైంది రాలేదు.
నా వయసు 29. పెళ్లై ఐదేళ్లు. ఫైబ్రాయిడ్స్ ఉండటం వల్ల ఓపెన్ మయోమిక్టమీ చేశారు. హార్మోన్ల అసమతౌల్యం కారణంగా మూడుసార్లు ఐయూఐ విఫలమైంది. ఐవీఎఫ్‌లో అండాలను రిట్రీవ్ చేస్తే ఒక్కటీ ఆరోగ్యకరమైంది రాలేదు. దాంతో దాత నుంచి సేకరించాం. అయినా అండం గర్భాశయంలో అతుక్కోలేదు. ఇప్పుడేం చేయమంటారు? ప్లీజ్... నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- మాధురి, ఇ-మెయిల్
గర్భధారణ సహజంగా జరిగి, శిశువు తొమ్మిది నెలలూ సజావుగా పెరిగి సుఖ ప్రసవం జరగాలంటే ప్రత్యుత్పత్తి అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉండాలి. అండంతో పాటు స్త్రీ, పురుష కణాల కలయిక జరిగి ఫలదీకరణకు ఫెలోపియన్ ట్యూబ్‌లు హెల్తీగా ఉండాలి. ఆ పిండం గర్భాశయానికి తిరిగి ప్రయాణించి గర్భాశయం లోపలి పొరలో అతుక్కుని పెరగడానికి, ఆరోగ్యవంతమైన గర్భాశయం, సమతుల్యంగా ఉన్న హార్మోన్లు అవసరం. బిడ్డ పెరుగుదలలోనూ తల్లి ఆరోగ్యంతో పాటు ఇంకా ఎన్నో విషయాలు సక్రమంగా జరగాలి. ముందు దంపతులిద్దరికీ క్రోమోజోమ్‌లు, జన్యు అవకరాలు ఉండకూడదు. మీకు ఒకటి కాకుండా మూడు, నాలుగు సమస్యలున్నాయని తెలుస్తోంది. వీటిలో కొన్ని మాత్రమే సరిచేయడం వైద్యుల చేతిలో ఉంటుంది. మరికొన్నింటిని ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీలు కాదు. ఉదాహరణకు జన్యు సమస్యలు. దాత నుంచి సేకరించిన అండంతో కూడా ఐవీఎఫ్ విజయవంతం కాలేదంటే... ఇక మిగిలింది దాత నుంచి అండం గ్రహించి మీ వారి వీర్యకణంతో ఫలదీకరణం చేసి, మరో స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడమే. దీన్ని సరోగసీ అంటారు. మీ విషయంలో వైద్యులు ఇప్పటికే అన్ని రకాలుగా ప్రయత్నించి ఉంటారని అనుకుంటున్నా. ఏ ప్రయత్నమూ ఫలించకపోతే మిగిలింది సరోగసీ మాత్రమే. కాబట్టి దంపతులిద్దరూ మరోసారి వైద్యులను సంప్రదించండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.