ఏ సరదాలూ ఉండకూడదంటారు...
మా పెళ్లై రెండేళ్లైంది. మావారు ఎప్పుడూ సీరియస్‌గా, ఏదో కోల్పోయినట్టే ఉంటారు. నాకేమో ఉన్నంతలో సంతోషంగా, సరదాగా ఉండటం ఇష్టం. నేనూ ఉద్యోగం చేస్తున్నా
మా పెళ్లై రెండేళ్లైంది. మావారు ఎప్పుడూ సీరియస్‌గా, ఏదో కోల్పోయినట్టే ఉంటారు. నాకేమో ఉన్నంతలో సంతోషంగా, సరదాగా ఉండటం ఇష్టం. నేనూ ఉద్యోగం చేస్తున్నా... నా పుట్టింటి వాళ్లకు ఆర్థిక సాయం చేయనివ్వరు. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లనివ్వరు. ఉద్యోగం, ఇల్లు తప్ప ఏ సరదాలు, సంతోషాలు ఉండకూడదంటారు. ఎప్పుడైనా ఎదురుచెబితే కొన్ని రోజులు నాతో మాట్లాడరు. జీవితాంతం ఇలా భయపడుతూ బతకాల్సిందేనా?
- ఓ సోదరి, వరంగల్
మీ భర్త వ్యక్తిత్వం, మానసిక స్థితిని బట్టి అతను నలుగురిలో కలిసే మనిషిలా కనిపించడం లేదు. పరిచయాలు పెంచుకుని వాళ్ల ఇళ్లకు వెళ్లడం, వాళ్లని ఇంటికి పిలవడం లాంటి అవకాశాలు లేనట్టే. ఇలాంటి వారు భార్య మీద ఆంక్షలు పెడతుంటారు. ఎవర్నీ కలవకుండా చేయడం, మీ తల్లిదండ్రులకు ఏమీ ఇవ్వనివ్వకపోవడం అందులో భాగమే. బంధుమిత్రులతో కలివిడిగా ఉంటే మనసుకు ఆనందంగా ఉంటుందని అతనికి అర్థమయ్యేలా చెప్పి, వారితో కాంటాక్ట్‌లో ఉండండి. లేదంటే విరక్తి చెంది, కుంగుబాటుకు గురయ్యే అవకాశముంది. అలాగే అమ్మావాళ్లు కష్టమైన స్థితిలో ఉన్నారని, మీ అనుమతితోనే సాయం చేస్తానని, లేదంటే మీరే ఇవ్వండి, దాంతో వాళ్లకి మీపట్ల గౌరవభావం కలుగుతుందని చెప్పండి. చాలా మంది అత్తింటివారు ఆమె సంపాదన తమకే చెందాలనుకుంటారు. పుట్టింటివారి కోసం ఖర్చుపెట్టేందుకు అనుమతించరు. మనవాళ్ల ఆలోచనలు అలా ఉంటున్నాయి. ఇక్కడే కాదు, విదేశాలకు వెళ్లినా అలాగే ఉంటున్నారు. ఆమె తరపువారినీ ఆదరించే వాళ్లూ కొద్దిమందే ఉన్నారు. కూతురికి పెళ్లయితే తల్లిదండ్రులు కూడా ఆమె నుంచి తీసుకోవడానికి ఇష్టపడరు. అల్లుడి ముందు పలుచనైపోతామని ఆర్థిక ఇబ్బందులున్నా చెప్పుకోరు. కొట్టడం, తిట్టడం లాంటి వేధింపులు లేకుండా ఇదొక్కటే ఇబ్బంది అయ్యి, కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటే అతనికి అనునయంగా చెప్పండి. అయినా వినకపోతేే పుస్తకాలు చదవడం, టీవీ చూడటం లాంటి ఇష్టమైన, ఆనందాన్నిచ్చే వ్యాపకాలు పెట్టుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.