నాన్న పెన్షన్‌ అక్కకు వస్తుందా!

మా నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసి 1978లో పదవీ విరమణ చేశారు. 1991లో మరణించారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్‌ వచ్చేది. 2020లో ఆమె ...

Published : 06 Dec 2021 01:24 IST

మా నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ ఉద్యోగిగా పనిచేసి 1978లో పదవీ విరమణ చేశారు. 1991లో మరణించారు. అప్పటి నుంచి అమ్మకు పెన్షన్‌ వచ్చేది. 2020లో ఆమె చనిపోయింది. మా అక్క 62 ఏళ్ల అవివాహిత. నిరుద్యోగి. మా నాన్నగారి పెన్షన్‌కు అక్క అర్హురాలు కాదన్నారు. ఎందుకంటే అమ్మ బతికున్నప్పుడు అక్క పేరును పెన్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో నమోదు చేయించలేదు. ప్రస్తుతం అక్క ఈ పెన్షన్‌కి ఎలిజబుల్‌ అవుతుందా? ఒకవేళ అర్హురాలైతే మేం ఏయే పత్రాలు, దరఖాస్తులను ఎక్కడ సమర్పించాలి? ఇరవై ఐదేళ్ల లోపు లేదా వైకల్యం ఉన్న మహిళలను డిపెన్‌డెంట్స్‌గా పరిగణిస్తారా?

- పద్మ

తెలంగాణ పెన్షన్‌ రూల్స్‌ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్‌కు పెళ్లికాని కూతురు కూడా అర్హురాలే. మీ నాన్నగారు 1978లో రిటైర్డ్‌ అయినప్పుడు మీ అమ్మగారి పేరు ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హురాలిగా చూపించి ఉంటారు. మీ అమ్మగారు ఉన్నంత కాలం ఆవిడ... ఆ తర్వాత మీ పెళ్లి కాని సోదరి కూడా అర్హురాలే అవుతుంది. దానికి మీ అమ్మగారి మరణ ధృవీకరణ పత్రంతోపాటు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కూడా జత చేసి సంబంధిత విభాగం వారికి ఒక అర్జీ (అప్లికేషన్‌) పెట్టండి. మీ అక్క పేరు ఇవ్వకపోవడానికి కారణం మీ అమ్మే అర్హురాలు కాబట్టి. కానీ ఇప్పుడు మీ అక్కే రెండో అర్హురాలు. ఆవిడ స్థితిగతులు కూడా వివరించండి. సాధారణంగా డిపార్ట్‌మెంట్‌ అధిపతికి అప్లికేషన్‌ పంపాలి. ఒకవేళ వారు మీ అక్క పేరును ఫ్యామిలీ పెన్షన్‌లో ప్రస్తావించలేదనే కారణంతో తిరస్కరిస్తే దీన్ని మీరు హై కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసి సవాలు చేయొచ్చు. ఫ్యామిలీ పెన్షన్‌ రూల్స్‌... రూల్‌-50 ప్రకారం చనిపోయిన ఉద్యోగి భార్య/భర్త/కొడుకు /పెళ్లికాని కూతురు/విడాకులు తీసుకున్న కూతురు/వితంతు కూతురు మళ్లీపెళ్లి చేసుకునే వరకు లేదా వారు సంపాదన మొదలుపెట్టేవరకు లేదా 25 ఏళ్లు వచ్చేవరకు... వీటిలో ఏది ముందు ఐతే అంతవరకు అర్హులు. ఇంకా మూడో క్లాజ్‌ ప్రకారం కొడుకు/కూతురు శారీరకంగా లేదా మానసికంగా వికలాంగులైతే వాళ్లు జీవితాంతం కొన్ని నియమ నిబంధనలతో అర్హులవుతారు. కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా మీ అక్కతో అప్లికేషన్‌ పెట్టించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని