ఆ బాధితురాలిని నేనయ్యా!

ఆఫీసులో ఓ సహోద్యోగి సకాలంలో తను పని పూర్తి చేయలేనప్పుడల్లా ఆ నిందని వేరొకరిపై మోపుతాడు. ఇప్పుడా బాధితుల స్థానంలో నేనున్నా. నా పై అధికారుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు. ఈ సమస్యకూ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, నా నుంచి రావాల్సిన సమాచారం రాలేదని చెప్పాడు.

Published : 08 Dec 2021 00:40 IST

ఆఫీసులో ఓ సహోద్యోగి సకాలంలో తను పని పూర్తి చేయలేనప్పుడల్లా ఆ నిందని వేరొకరిపై మోపుతాడు. ఇప్పుడా బాధితుల స్థానంలో నేనున్నా. నా పై అధికారుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలీడం లేదు. ఈ సమస్యకూ తనకూ ఎలాంటి సంబంధం లేదనీ, నా నుంచి రావాల్సిన సమాచారం రాలేదని చెప్పాడు. తన నుంచి నాకే మెయిల్‌ రాలేదు. అదే చెబితేే.. జంక్‌ ఫోల్డర్‌లోకి వెళ్లిందేమోనని వాదిస్తున్నాడు. ఇప్పుడేం చేయా¦లి?

- ఓ సోదరి

ముందు భావోద్వేగాలను పక్కన పెట్టి, ప్రశాంతంగా పరిస్థితిని అంచనా వేయండి. నింద పడినా అసలు సమస్య అవతలి వ్యక్తిది, మీది కాదు. కాబట్టి మీ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి తెలివిగా ప్రతిస్పందించాలి. ఇలాంటివారితో విభేదిస్తున్నప్పుడు.. మూడో వ్యక్తికి సమస్యను చెప్పి సలహా తీసుకోవడం తెలివైన పని. అయితే వాళ్లు మీకు ఆప్తులు, దగ్గరివారై ఉండాలి. వాళ్లకి మీ సమస్య, పరిస్థితిని మొత్తం చెప్పేయండి. కోపాన్ని అంతా దింపేసుకోండి. అంతేకానీ ఆ సహోద్యోగిని మాత్రం ప్రశ్నించకండి. మనసు తేలికపడ్డాక విడిగా మాట్లాడాలని కోరండి. మీ వైపు అంటే.. ‘ఫలానా నా బాధ్యత అని మీరు చెప్పారు కదా! కానీ నాకు పరిస్థితి కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. ఎందుకంటే..’ అంటూ వాస్తవాలపైనే దృష్టిపెట్టండి. వ్యక్తిగత ఆరోపణలు వద్దు. పరిస్థితి వేడెక్కితే.. వచ్చేయండి. అవసరమైతే మీ నిర్దోషిత్వాన్ని నిరూపించే రుజువులతో పైవాళ్లను కలవండి. మీ బాధ్యతలనూ స్పష్టం చేయండి. వాళ్లు మీవైపు ఉంటే.. వేరేవాళ్లు మిమ్మల్ని తప్పుగా పేర్కొనలేరు. ఈ క్రమంలో వదంతులకు ఆస్కారం ఇవ్వకండి. ఈ సమయంలో ఒకరితో బాధను పంచుకోవాలనిపించడం సహజమే. అయినా వద్దు. చుట్టూ ఉన్నవారితోనూ జాగ్రత్త. ఎవరైనా చొరవ చూపి స్నేహం చేయాలనుకున్నా అనుమానించండి. అవసరమైతే చర్చలను డాక్యుమెంట్‌ రూపంలో రాసి పెట్టుకోండి. చేయాల్సిన పనుల్నీ మెయిల్‌ రూపంలో రూఢీ చేసుకుంటే నిందలకు ఆస్కారముండదు. ఎవరైనా సహోద్యోగి జరిగినదాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేసినా నవ్వి ఊరుకోండి. మన తప్పుల్ని ఎదుటివారిపై రుద్దడం అపరిపక్వతకు సంకేతం. మీ సహోద్యోగి ఆ తీరును ఇతరులూ గుర్తించగలరు. కాబట్టి, మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్