చదవమంటే పారిపోతుంది!
మా పాపకు ఎనిమిదేళ్లు. తనకు చదువంటే భయం. బలవంతంగా కూర్చోబెడితే మాటిమాటికీ యూరిన్‌కు వెళ్తుంది. చదువు ఊసెత్తకపోతే అసలు వాష్‌రూమ్‌కే వెళ్లదు.
మా పాపకు ఎనిమిదేళ్లు. తనకు చదువంటే భయం. బలవంతంగా కూర్చోబెడితే మాటిమాటికీ యూరిన్‌కు వెళ్తుంది. చదువు ఊసెత్తకపోతే అసలు వాష్‌రూమ్‌కే వెళ్లదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి?
- ఒక సోదరి, చిక్కడపల్లి
సాధారణంగా పిల్లలెవరైనా ఆటల్లో చూపే ఉత్సాహం చదువు మీద చూపరు. ముఖ్యంగా చిన్న తరగతుల వారు. మీ పాప చదువు మొదలు పెట్టినప్పుడే వాష్‌రూమ్‌కి వెళ్తానంటూ, తక్కినప్పుడు మామూలుగా ఉంటోందంటే.. అది ఆందోళనకి సంకేతం. దానికి కారణమేంటో ఆలోచించాలి. చదువును తప్పించుకోవడానికి వెళ్తుండొచ్చు. లేదా వయసుకు తగిన తెలివి లేకున్నా, అర్థం చేసుకునే సామర్థ్యం తక్కువున్నా పాఠాలు బోధపడక భయపడుతూ.. ఆ సంగతి చెప్పడం తెలీక అలా వెళ్తుండవచ్చు. అంటే బార్డర్‌లైన్ ఇంటిలిజెన్స్ అయ్యుండొచ్చు. రెండోది స్పెసిఫిక్ లర్నింగ్ డిజెబిలిటి కావచ్చు. అంటే అక్షరాలు గుర్తుపట్టడం, చదవడం, రాయడం లాంటి అంశాల్లో లోపం. మూడో కారణం ఏకాగ్రత లోపించడం, లేదా ఓవరాక్టివిటీతో కూడా మాటిమాటికీ మూత్రానికి వెళ్తారు. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అంటారు. మీరు తప్పనిసరిగా చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లండి. వాళ్లు పాప పుట్టిన దగ్గర్నుంచీ వివరాలన్నీ సేకరించి ఈ మూడు విషయాల్లో లోపాలున్నాయేమో చూస్తారు. ఏడీహెచ్‌డీ ప్రశ్నావళితో పరీక్షిస్తారు. శ్రద్ధపెట్టడంలో, కేంద్రీకరించడంలో సమస్య ఉంటే తెలుస్తుంది. ఇవే కాకుండా పాపకి చదువు, టీచర్లు, తోటి పిల్లలంటే భయాలున్నాయేమో చూస్తారు. చదువుపట్ల భయం తగ్గి ఆసక్తి కలిగే పద్ధతులు నేర్పిస్తారు. ఆమెకెలా నేర్పించాలో, ప్రోత్సహించాలో మీకూ శిక్షణనిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.