మొదటిసారి గర్భస్రావాలు ఎక్కువా?

నాకు 25 ఏళ్లు. మూడు నెలల గర్భిణిని. మొదటిసారి గర్భం చాలా బలహీనంగా ఉంటుందనీ, గర్భస్రావం (అబార్షన్‌) అయ్యే ప్రమాదమెక్కువని విన్నా. ఇది నిజమేనా... ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు

Published : 13 Dec 2021 01:24 IST

నాకు 25 ఏళ్లు. మూడు నెలల గర్భిణిని. మొదటిసారి గర్భం చాలా బలహీనంగా ఉంటుందనీ, గర్భస్రావం (అబార్షన్‌) అయ్యే ప్రమాదమెక్కువని విన్నా. ఇది నిజమేనా... ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?              

- ఓ సోదరి

మొదటి ప్రెగ్నెన్సీ అయినా నాలుగో గర్భమైనా గర్భస్రావాలనేవి జరగొచ్చు. అంతేతప్ప మొదటిసారి గర్భం దాల్చినప్పుడే ఎక్కువగా అవుతాయన్న దాంట్లో నిజం లేదు. వందమంది గర్భిణులను తీసుకుంటే అందులో 15-20 శాతం మందిలో గర్భస్రావాలు (మొదటి, రెండు, మూడు... ఇలా ఎన్నో ప్రెగ్నెన్సీలోనైనా ) జరగొచ్చు. సాధారణంగా గర్భస్రావాలు రెండు రకాలు. ఒకటి... దానంతట అవి జరిగేవి. రెండు...  తల్లికి కానీ, బిడ్డకు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు వైద్యులు చేసేవి. సహజంగా జరిగే గర్భస్రావాల్లో..అందులోనూ ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో జరిగే గర్భస్రావాల్లో నూటికి 60 శాతం క్రోమోజోముల్లో లోపాల వల్ల జరుగుతాయి.

ఇక మిగిలిన 40 శాతం గర్భస్రావాలు... శిశువుకి వివిధ కారణాల వల్ల పుట్టుకతో వచ్చే అవకరాలు (మెదడు, వెన్నెముక నిర్మాణంలో లోపాలు), ఇన్‌ఫెక్షన్లు, ఇమ్యూనిటీ, హార్మోన్ల వ్యవస్థలో సమస్యలు, గర్భాశయం ఆకృతిలో లోపాల వల్ల జరుగుతాయి. ముఖ్యంగా అసాధారణ క్రోమోజోములే ఈ అబార్షన్లకు ప్రధాన కారణం.  

ఇక రెండో త్రైమాసికంలో జరిగేవాటికి కారణాలు... ఇన్‌ఫెక్షన్లు, తల్లికి ఆరోగ్య సమస్యలు (మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు) ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ గ్రూపు ఉన్నవారికి జరిగే ఐసో ఇమ్యూనైజేషన్‌, గర్భాశయంలో సెప్టెమ్‌ బై కార్నుయేట్‌ యుటరస్‌ లాంటి లోపాలు, గర్భాశయ ముఖద్వారం వదులుకావడం... ఇవన్నీ  ముఖ్యకారణాలు.

జాగ్రత్తలు... ఎన్నోసారి గర్భం ధరించినా సాధారణంగా గర్భిణులందరూ తీసుకునే జాగ్రత్తలే తీసుకోవాలి. సమతుల ఆహారం, చక్కటి జీవన శైలి, తగినంత వ్యాయామం, రెగ్యులర్‌ చెకప్‌, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు వేయించుకోవడం, డాక్టర్లు సూచించిన పరీక్షలు చేయించుకోవడం ఇవన్నీ అవసరం. ముఖ్యమైన సూచన ఏమిటంటే కొవిడ్‌ పెరుగుతున్న ఈ సమయంలో అనవసరమైన ప్రయాణాలు, ఎక్కువ జనం గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలకు దూరంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని