త్వరగా బరువు తగ్గాలంటే!

నా వయసు 40. బరువు 80. ఎత్తు 5.3. నెలపాటు కేవలం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే త్వరగా బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. ఇది సరైన పద్ధతేనా?

Updated : 18 Dec 2021 06:29 IST

నా వయసు 40. బరువు 80. ఎత్తు 5.3. నెలపాటు కేవలం పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వ్యాయామాలు చేస్తే త్వరగా బరువు తగ్గుతానని ఎవరో చెప్పారు. ఇది సరైన పద్ధతేనా?

-భాగ్య, హైదరాబాద్‌

శరీరంలో పేరుకు పోయిన కొవ్వు, కండ... ఇతర పదార్థాలతో కూడిన బరువును తొలగించడం సున్నితమైన ప్రక్రియ. దాన్ని శాస్త్రీయ విధానంలో నియంత్రించుకోవాలి. 40 దాటిన మహిళల్లో హార్మోన్లలో మార్పులతోపాటు శరీర జీవక్రియల్లో కూడా తేడాలొస్తాయి. మీరు చెప్పిన పద్ధతిలో కొవ్వుతోపాటు కండశాతమూ తగ్గిపోతుంది. అది మంచిది కాదు. అలా బరువు త్వరగా తగ్గినట్లు అనిపించినా అది స్థిరంగా ఉండదు. ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాక కొవ్వు పెరిగిపోతుంది. అయితే కండ తిరిగి రాదు.
మీరేం చేయాలంటే.. కెలొరీలు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలి. స్వీట్స్‌, వేపుళ్లు, ఐస్‌క్రీమ్స్‌, చాక్లెట్స్‌, తీపి, ఉప్పు అధికంగా ఉండే వాటికి దూరంగా ఉండాలి.  వీటితోపాటు ఆహారంలో తక్కువ కెలొరీలు ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. బరువుకు తగ్గట్లు సరైన మోతాదులో మాంసకృత్తులు, పీచు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే కొవ్వును మాత్రం తగ్గించుకోగలుగుతాం. దాంతోపాటు చర్మం, జుట్టు నిర్జీవమవకుండా, శక్తిస్థాయులు, ఎముక ఆరోగ్యం, జీవక్రియా రేటు తగ్గకుండా కాపాడుకోగలుగుతాం. మీ బరువు 80 కిలోలు కాబట్టి 80 గ్రా. మాంసకృత్తులు తీసుకోవాలి. అందుకు రోజూ దాదాపు 200 గ్రా పండ్లు, 500 గ్రా., వరకు ఆకు, కాయగూరలు కలిపి తీసుకోవచ్చు. తక్కువ వెన్న శాతం ఉన్న పాలు, ఆ పాలతో చేసిన పెరుగు 300 గ్రా. వరకు తీసుకోవాలి. చాలా తక్కువ మోతాదులో అంటే 250 గ్రాముల వరకు గింజ ధాన్యాలు (గోధుమ, బియ్యం, మిల్లెట్స్‌), 100 నుంచి 150 గ్రా., వరకు పప్పు దినుసులు తీసుకోండి. మాంసాహారులైతే ఉడకపెట్టిన గుడ్డు, చేపలు, చికెన్‌ (100 గ్రా.) తినొచ్చు. ఆహారాన్ని కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. రోజుకు 4, 5 చెంచాల కంటే ఎక్కువ నూనె వాడొద్దు. ఇలా చేస్తూ ఉంటే జీర్ణక్రియలో మార్పులు ఉండవు.

వ్యాయామమూ అవసరమే... రోజూ కనీసం అరగంట నడక, మరో అరగంట యోగా/సైక్లింగ్‌ చేసినప్పుడు శరీరంలోని కొవ్వు కరగడం మొదలవుతుంది. ఇలా మూడు నుంచి ఆరు నెలలు చేస్తే చాలావరకు కొవ్వు తగ్గి శరీరంలో మార్పు తప్పనిసరిగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని