మందులతో పీసీఓఎస్‌ పూర్తిగా తగ్గదా?

నాకు 24. వివాహమై ఏడాదవుతోంది. ఈ మధ్యే పీసీఓఎస్‌ బారిన పడ్డా. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : 20 Dec 2021 01:20 IST

 

నాకు 24. వివాహమై ఏడాదవుతోంది. ఈ మధ్యే పీసీఓఎస్‌ బారిన పడ్డా. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- ఓ సోదరి

పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) మల్టీ ఫ్యాక్టోరియల్‌ మల్టీ సిస్టమ్‌ డిజార్డర్‌ అని చెప్పొచ్చు. అంటే వివిధ కారణాల వల్ల శరీరంలోని పలు వ్యవస్థల మీద దుష్ప్రభావం చూపడం. దీనికి మూల కారణం శరీరంలో గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌ను, అండాశయాల నుంచి హార్మోన్ల సమతుల్యాన్ని నిర్ధరించే కొన్ని జన్యువుల్లో లోపమని చెప్పొచ్చు. పీసీఓఎస్‌లలో హార్మోన్లలో వచ్చే ముఖ్యమైన మార్పు పురుష సంబంధ హార్మోన్లు ఎక్కువగా తయారుకావడం. ఇది పుట్టుకతోనే ఉన్నా తర్వాత బయట పడటానికి రెండు కారణాలున్నాయి. బరువు పెరగడం, అధిక ఒత్తిడి. సాధారణంగా ఇది కౌమార దశలోనే బయట పడుతుంది.

ఒకట్రెండు నెలలు మందులు వాడటం వల్ల తేలికగా తగ్గిపోయే సమస్య కాదిది. చక్కటి జీవనశైలి, పోషకాహారం, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ బరువును నియంత్రణలో పెట్టుకోవడం, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం లాంటివి ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు. మీరు కొన్నాళ్లు కుటుంబ నియంత్రణ పాటించాలనుకుంటే గర్భనిరోధక నోటి మాత్రల వాడకం తప్పనిసరి. వీటిలో కూడా ప్రత్యేకంగా యాంటీఆండ్రోజెన్‌ లేదా పురుష హార్మోన్లకు ప్రతికూలంగా పనిచేసే మాత్రలను వాడాలి. వీటి వల్ల నెలసరి సక్రమంగా రావడం, మొటిమలు, అవాంఛిత రోమాలు లాంటి సమస్యలు తగ్గుతాయి. పిల్లలు కావాలనుకునే వరకూ ఈ మాత్రలు వాడొచ్చు. ప్రీ డయాబెటిస్‌ వంటి సమస్యలేర్పడితే ‘ఇన్సులిన్‌ సెన్సిటైజ్‌ మందు’ తప్పనిసరిగా వాడాలి. మొటిమలు, అవాంఛిత రోమాలు తగ్గడానికి మందులతోపాటు కాస్మొటిక్‌ ట్రీట్‌మెంట్‌ అవసరం. కాబట్టి డెర్మటాలజిస్ట్‌నూ సంప్రదించాలి. ఆరు నెలలు మాత్రలు వాడిన తర్వాత అవాంఛిత రోమాల రంగు, మందం, తగ్గుతాయి. అప్పుడు లేజర్‌, ఎలక్ట్రాలిసిస్‌ చేయించుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. పీసీఓఎస్‌ అనేది పిల్లలు పుట్టకపోవడానికి కారణాల్లో ప్రధానం. కాబట్టి పిల్లలు కావాలనుకున్నప్పుడు వైద్యుల సూచనల ప్రకారం అండం విడుదలకు మందులు వాడాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

<