జడ మెలి తిరిగిపోతోంది!

నా వయసు 23. ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఇటీవలి కాలంలో చిన్న అనారోగ్యానికీ గురవలేదు. ఏ మందులూ వాడట్లేదు. అయినా జుట్టు విపరీతంగా ఊడుతోంది. జడ వేసుకుంటోంటే మెలి తిరిగిపోతోంది. చాలా దిగులుగా ఉంటోంది. ఏం చేయాలి?

Published : 24 Dec 2021 00:57 IST

నా వయసు 23. ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఇటీవలి కాలంలో చిన్న అనారోగ్యానికీ గురవలేదు. ఏ మందులూ వాడట్లేదు. అయినా జుట్టు విపరీతంగా ఊడుతోంది. జడ వేసుకుంటోంటే మెలి తిరిగిపోతోంది. చాలా దిగులుగా ఉంటోంది. ఏం చేయాలి?

- ఓ సోదరి

వయసులో ఎండోక్రైన్‌ అంటే పురుష హార్మోన్లు పెరగడం, హార్మోన్ల అసమతౌల్యత జుట్టు ఊడటానికి కారణమవొచ్చు. హెయిర్‌ స్టైల్స్‌, ఐరనింగ్‌, స్ట్రెయిటనింగ్‌, బ్లోయర్లు వాడటం, గట్టిగా లాగి జడలు, పోనీ వేయడంతోపాటు విటమిన్‌, ఐరన్‌ లోపం, ఎనీమియా, ఒత్తిడీ కారణమే. 50-100 వరకూ వెంట్రుకలు ఊడటం సాధారణమే. అంతకన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. థైరాయిడ్‌, డీహెచ్‌ఈఏ, టెస్టోస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఎఫ్‌ఎస్‌హెచ్‌, సీబీపీలతోపాటు ఐరన్‌, సీరమ్‌ ఫెరటిన్‌ లెవెల్స్‌ చెక్‌ చేయించుకోండి.

వీటిల్లో ఏవైనా లోపాలుంటే మందులతో సరిచేసుకోవచ్చు. డైటింగ్‌ లాంటివి పక్కన పెట్టి విటమిన్‌లు ఎ, బి, సి, డి, ఇ, జింక్‌ ఎక్కువ ఉండే ఆహారాన్ని తగినంతగా తీసుకోవాలి. చిలగడదుంప, గుడ్డు, పాలు, పాలకూర, గుమ్మడి, తాజా పండ్లు, చిరుధాన్యాలు, చేప, ఆకుకూరలు, మష్రూమ్‌, బాదం, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజల్ని రోజూ తీసుకోవాలి. శారీరక, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి యోగా, ప్రాణాయామం వంటివి చేయాలి. ఈ కాలంలో మాడు మీద చర్మం పొడిబారి కూడా జుట్టు ఊడుతుంది. తలస్నానానికి గోరు వెచ్చని నీటినే వాడాలి. గాఢత తక్కువున్న షాంపూ, కండిషనర్‌ ఉపయోగించాలి. వైద్యుల సూచనతో మల్టీవిటమిన్‌, బయోటిన్‌ సప్లిమెంట్లు తీసుకోవచ్చు. ప్రొటీన్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ, లేజర్‌ కోంబ్స్‌ వంటివీ చేస్తారు. అదీ వైద్యుని సూచన మేరకే. సహజంగా అంటే.. మందార ఆకుల్ని కొబ్బరినూనెలో మరగబెట్టి రాసుకోండి. గుంటగలగరాకును నూనె, పేస్ట్‌ రూపంలో రాసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని