ప్రెగ్నెన్సీలో ఎంత హిమోగ్లోబిన్‌ ఉండాలి?

గర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్‌ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్‌ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో  ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్‌ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్‌ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి.  వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను ...

Updated : 25 Dec 2021 05:30 IST

నాకు 27. పెళ్లై ఏడాది. నాలుగో నెలలో అబార్షన్‌ అయ్యింది. హిమోగ్లోబిన్‌ 4 శాతమే ఉందన్నారు. ఇది గర్భిణులకు ఎంతుండాలి. రక్తహీనత తగ్గాలంటే ఏం తినాలి?

- ఓ సోదరి


ర్భం ధరించినప్పుడు హిమోగ్లోబిన్‌ శాతం 11కి తగ్గకుండా చూసుకోవాలి. అబార్షన్‌ అయినప్పుడు కొన్నిసార్లు విపరీతంగా రక్తస్రావమవుతుంది. ఇదీ రక్తహీనతకు దారి తీస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న మహిళల్లో  ఇలాంటి ఇబ్బందులొస్తే పరిస్థితి మరింత జటిలమవుతుంది. నాలుగు శాతం హిమోగ్లోబిన్‌ అంటే చాలా తక్కువ. అతి త్వరగా హిమోగ్లోబిన్‌ పెంచుకునే పద్ధతులేంటో మీ వైద్యులనడిగి తెలుసుకోండి.  వాపు, శ్వాస ఇబ్బందులు, జ్వరం, అలసట... లాంటి ఇతర లక్షణాలను బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. పరిస్థితి తీవ్రతను బట్టి కొన్నిసార్లు ఐరన్‌ను డ్రిప్‌ విధానంలో శరీరంలోకి ఎక్కిస్తారు. లేదా రక్తం కూడా ఎక్కిస్తారు. లేదంటే ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బి-కాంప్లెక్స్‌ విటమిన్‌ మాత్రలను తీసుకోవాలి.

మాంసకృత్తులు, బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఈ మూడూ మీ ఎత్తు, బరువుకు సరిపోయేలా లభించినప్పుడే ఐరన్‌ మాత్రలను శరీరం శోషించుకుంటుంది. మాంసాహారులైతే గుడ్డు, మాంసం నుంచి ప్రొటీన్లను పొందొచ్చు. శాకాహారులైతే పొట్టుతో ఉన్న సెనగలు, ఆకుకూరలు, డేట్స్‌ లాంటివి తీసుకోవచ్చు. ఫోలిక్‌ యాసిడ్‌ కోసం... మొలకెత్తిన గింజలు, ఆకు కూరలు , పెసలు తినొచ్చు. విటమిన్‌-సి కావాలంటే ఉసిరి, జామ, బొప్పాయి, క్యాబేజీ, నిమ్మ లాంటివి తీసుకోవచ్చు.  
ప్రత్యామ్నాయాలు.. టీ, కాఫీలు ఎక్కువగా తాగొద్దు. ఉప్పు వాడకం తగ్గించాలి. కనీసం మూడు నెలలు పైన చెప్పిన విధంగా మాత్రలు వేసుకుంటూ, పోషకాహారం తీసుకున్నప్పుడు శరీరం స్వతహాగా హిమోగ్లోబిన్‌ను తయారు చేసుకోగలుగుతుంది. గర్భం ధరించాలనుకుంటే హిమోగ్లోబిన్‌ వృద్ధి కోసం కొత్త ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. ఉదాహరణకు మూడుపూటలా రాగులు, సజ్జలు, దంపుడు బియ్యం తీసుకోండి. పెసలు, రాజ్మా, సెనగలతోపాటు కీరా, టొమాటో లాంటివాటిని పచ్చిగా తినాలి. నిమ్మరసం తాగాలి. జామ, బొప్పాయి, కమలాతోపాటు నిల్వ ఉసిరి తిన్నా తగినంత విటమిన్‌-సి దొరుకుతుంది. పొట్టలో నులిపురుగులు లేకుండా డీ వార్మింగ్‌ మాత్రలు తప్పనిసరి. హిమోగ్లోబిన్‌ శాతం పన్నెండు వచ్చిన తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకుంటే తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని