పాపను ఎలా మార్చుకోవాలి?

మా పాపకు నాలుగున్నరేళ్లు. చాలా తెలివైంది. కానీ తోడబుట్టినవాళ్లు, ఇతర పిల్లలు తనను పట్టించుకోవడంలేదని, తన మాట వినడం లేదని ఏడుస్తుంది. ఎంత నచ్చజెప్పినా వినదు. పాపను ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు..

Updated : 30 Dec 2021 04:59 IST

మా పాపకు నాలుగున్నరేళ్లు. చాలా తెలివైంది. కానీ తోడబుట్టినవాళ్లు, ఇతర పిల్లలు తనను పట్టించుకోవడంలేదని, తన మాట వినడం లేదని ఏడుస్తుంది. ఎంత నచ్చజెప్పినా వినదు. పాపను ఎలా మార్చుకోవాలో అర్థం కావడం లేదు..

- ఒక సోదరి

మీ పాపని మీరు గారాబం చేయడం వల్ల తోబుట్టువులు, బయటివాళ్లు కూడా తనను ప్రత్యేకంగా చూడాలని ఆశిస్తోంది. తను వాళ్లతో సర్దుకుపోలేక వాళ్లే తన ఇష్ట ప్రకారం నడుచుకోవాలనుకుంటోంది. పిల్లలందరి మానసిక స్థితి, టెంపర్‌మెంట్‌ ఒకలా ఉండవు. కొందరు త్వరగా కలిసిపోతారు. ఇంకొందరు మొదట కష్టం అనిపించినా తర్వాత కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. మీ పాప కూడా అంతే. తనది ఆధిపత్య ధోరణి అయ్యుంటుంది. సాధారణంగా ఎవరైనా అనుకూలమైన వారితో కలిసిపోతారు. మీ పాప మొండిగా, పెత్తందారులా ఉన్నందున దూరం పెడుతున్నారేమో! మరీ చిన్నపిల్ల కనుక ఇదంతా అర్థం కాదు. పాపను ఎవరితోనూ పోల్చద్దు. అతి గారాబం చేయొద్దు. అడిగినవన్నీ కాక, పరవాలేదు అనిపించినవే కొనివ్వండి. వాటికీ షరతులు పెట్టండి. నువ్వు ప్రేమ చూపితే వాళ్లూ స్నేహంగా ఉంటారు, తీసుకోవడమే కాదు, ఇవ్వాలి కూడా అని చెప్పండి. బయట గొడవపడుతుంటే ఆమెని వెంటనే ఇంటికి తీసుకొచ్చేయమని తక్కిన పిల్లలతో చెప్పండి. ‘వాళ్లు నిన్ను బాధపెడతారని ముందుగానే తీసుకొచ్చాం, నీ ప్రవర్తన వల్లే ఇలా జరుగుతోంది’ అని చెప్పండి. ఈ పద్ధతుల వల్ల ప్రయోజనం లేకపోతే సైకియాట్రిస్టును సంప్రదించండి. ఈ సమస్య అభద్రత వల్ల ఏర్పడిందా? టెంపర్‌మెంట్‌ వల్లనా అనేది అంచనా వేసి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. మీకూ కౌన్సెలింగ్‌ ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని