అప్పుడే ముడతలా?
వయసు 26 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నా. నా నుదుటి మీద, కంటి పక్కన గీతలు, ముడతలు వస్తున్నాయి. అప్పుడే ముఖంపై ఇవన్నీ ఏంటి? అసలే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పరిష్కారం చెప్పండి.
వయసు 26 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నా. నా నుదుటి మీద, కంటి పక్కన గీతలు, ముడతలు వస్తున్నాయి. అప్పుడే ముఖంపై ఇవన్నీ ఏంటి? అసలే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పరిష్కారం చెప్పండి.
- ఓ సోదరి
కొల్లాజెన్ తగ్గడం 20 ఏళ్ల నుంచే మొదలవుతుంది. దీంతో సాధారణంగా 30 పైబడిన వాళ్లలో ఈ సమస్యను చూస్తుంటాం. కొందరిలో మాత్రం జెనెటిక్, పల్చటి చర్మతత్వం, ఎక్కువగా ముఖం చిట్లించడం, కనుబొమ్మలు ఎగరేయడం వంటి ముఖకవళికల కారణంగా తక్కువ వయసులోనే వచ్చేస్తుంటాయి. మీరు ఉపయోగించే ఉత్పత్తుల్లో నియాసినమైడ్, కొలాయిడల్ ఓట్ మీల్, డైమెథికాన్ ఉండేలా చూసుకోండి. అలాగే గ్లైకాలిక్ ఆసిడ్, హైల్రునాయిక్ ఆసిడ్, ట్రెటినాయిన్, రెటినాల్, యాంటీ ఆక్సిడెంట్స్, పెప్టైడ్స్, మెగ్నీషియం ఉన్న డే, నైట్ క్రీమ్‌లు ఎంచుకోవాలి. ఇవి ఈ ముడతల్ని అదుపు చేయడంతోపాటు ఆలస్యం చేస్తాయి. చర్మం మరీ ఎక్కువగా పొడిబరుతున్నా, ఎండలో ఎక్కువగా తిరిగినా ముడతల ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక రాస్తుండాలి.
బాగా కనిపిస్తున్నాయనిపిస్తే బొటాక్స్ చేయించుకోవచ్చు. నుదుటిపై ఫ్రంటాలిజ్ మజిల్ ఉంటుంది. ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తున్నపుడు అక్కడ గీతల్లా పడుతుంది. వాటిని బొటాక్స్ ద్వారా తొలగించొచ్చు. అయితే ఇది శాశ్వతం కాదు. ప్రతి ఆరు నెలలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు టాపికల్ క్రీమ్‌లనూ తప్పక వాడాల్సి ఉంటుంది. గీతలు, ముడతలు మరీ లోతుగా ఉంటే ఫిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. వీటితోపాటు రెటినాయిక్ ఆసిడ్, గ్లైకాలిక్ ఆసిడ్, లాక్టిక్ ఆసిడ్ వంటి కెమికల్ పీల్స్ కూడా చేయించుకోవాలి. ఇవి డెడ్‌స్కిన్‌తోపాటు గీతల్నీ తగ్గిస్తాయి. మైక్నో నీడిలింగ్, ఆర్‌ఎఫ్, లేజర్స్‌తో అయితే కొల్లాజెన్‌నీ నింపొచ్చు. కళ్ల పక్కన గీతల్ని క్రోఫీట్ అంటాం. దీనికి 20 ఏళ్ల నుంచే అండర్ ఐ క్రీమ్ వాడాలి. నవ్వితే కనిపించే వాటిని డైనమిక్ రింకిల్స్ అంటాం. ఇవే పోనుపోనూ శాశ్వత.. అంటే స్టాటిక్ రింకిల్స్‌గా మారతాయి. ఎక్కువ వ్యాయామం చేసేవారు, ఐమేకప్ వాడేవాళ్లలో ఇది కనిపిస్తుంటుంది. రెటినాల్, హెల్రూనాయిక్ ఆసిడ్, పెప్టైడ్స్, విటమిన్ కె ఉన్న అండర్ ఐ క్రీమ్‌లను వాడండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.