..అయినా ప్రయోజనం లేదు

2020 లాక్‌డౌన్‌ నుంచి ఉద్యోగ జీవితమంతా హడావుడే. ముగ్గురు చేసేపని ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఎంత అలసిపోతున్నానో! ఏరోజూ పని పూర్తయ్యేసరికి రాత్రి 11, 12 గం. అవ్వాల్సిందే. ఈ విషయంగా మేనేజ్‌మెంట్‌కి అందరం ఫిర్యాదు కూడా చేశాం.

Published : 05 Jan 2022 01:54 IST

2020 లాక్‌డౌన్‌ నుంచి ఉద్యోగ జీవితమంతా హడావుడే. ముగ్గురు చేసేపని ఒక్కరే చేయాల్సి వస్తోంది. ఎంత అలసిపోతున్నానో! ఏరోజూ పని పూర్తయ్యేసరికి రాత్రి 11, 12 గం. అవ్వాల్సిందే. ఈ విషయంగా మేనేజ్‌మెంట్‌కి అందరం ఫిర్యాదు కూడా చేశాం. దీంతో ఇప్పుడు త్వరగా పడుకునే అవకాశం దొరికింది. అయినా విశ్రాంతి తీసుకున్న భావన కలగడం లేదు. ఇంకేం చేయాలి?

- శ్వేత, దిల్లీ


నేడు ఎంతోమంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. నిద్ర, విశ్రాంతి ఒకటి కాదు. చాలామంది ఈ విషయంలో పొరబడుతుంటారు. విశ్రాంతి వివిధ అంశాల్లో అవసరమవుతుంది.


1. శారీరక విశ్రాంతిలోనూ నిష్క్రియం, క్రియాశీలమని రెండు విభాగాలుంటాయి. మొదటిదానికి నిద్ర, రెండోదానికి యోగా, స్ట్రెచింగ్‌, మసాజ్‌ వంటివి ఉపశమనాన్నిస్తాయి.


2. కొందరు 7-8 గంటలు నిద్రపోతారు. అయినా అలసట పోదు. నిద్రపోతున్నా పని ఆలోచనలు మెదడును వదలకపోవడమే కారణం. కాబట్టి, ప్రతి రెండు గంటలకోసారి చిన్న విరామాలను తీసుకోవడం, మరుసటిరోజు చేయాల్సినవి గుర్తుగా రాసిపెట్టుకోవడం చేయాలి.


3. లైట్లు, కంప్యూటర్‌ తెరలు, శబ్దాలు.. ఇవన్నీ మన ఇంద్రియాలపై ప్రభావం చూపేవే. వీటికీ విశ్రాంతి కావాలి. గంటకు ఓ నిమిషం కళ్లు మూసుకుని ఉండాలి. రోజూ చివర్లో మొబైల్‌ సహా అన్నీ పక్కన పెట్టేయాలి.


4. సమస్యా పరిష్కారం, కొత్త ఆలోచనలకు ప్రయత్నించేవారికి సృజనాత్మక విశ్రాంతి కావాలి. ప్రకృతిని ఆస్వాదించండి. దూరప్రాంతాలు, స్థానిక పార్కులు, మీ పెరట్లో సమయం గడపడం వంటివన్నీ సాయపడేవే! అయితే చూడ్డానికే పరిమితమవొద్దు. వాటి చిత్రాలు గీయడం, ఫొటోలు తీయడం లాంటివి చేయండి.


5. అన్ని పనులూ, అన్నిసార్లూ నచ్చవు. పోనీ కుదరదు. అయినా ‘నో’ చెప్పలేం. ఇలాంటి వారికి భావోద్వేగ విశ్రాంతి అవసరం. అంటే భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశమన్నమాట. ఇందుకు.. ఎప్పుడూ సానుకూలంగా వ్యవహరిస్తూ, మీకు మద్దతునిచ్చే వాళ్లతో ఎక్కువ సమయం గడపండి.


6. చివరిది ఆధ్యాత్మిక విశ్రాంతి. ప్రేమ, అంగీకారం, మన అనిపించగల భావన దీని ద్వారా వస్తుంది. ప్రార్థన, మెడిటేషన్‌, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకుంటే సరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని