నడుము ఆ కొలత దాటనివ్వొద్దు!

కుటుంబ ఆర్యోగం మహిళ చేతిలోనే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లతో కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచొచ్చు. రోజూ ఆకుకూరతోపాటు తాజా పండ్లు తప్పక అందించండి. ఒకపూట గోధుమలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారం లేదా గుగ్గిళ్లు లాంటివి పెట్టండి. ముందు నుంచే పోషక పదార్థాలు తీసుకుంటూ,

Updated : 06 Jan 2022 05:37 IST

గత రెండేళ్లలో కొవిడ్‌ పరంగా శారీరక, మానసిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా. ఇప్పుడు మూడో ఉధృతి అంటున్నారు. ఇంటిల్లపాదినీ ఆరోగ్యంగా ఉంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?   

- ఓ సోదరి

కుటుంబ ఆర్యోగం మహిళ చేతిలోనే ఉంటుంది. చిన్న చిన్న అలవాట్లతో కుటుంబాన్నంతా ఆరోగ్యంగా ఉంచొచ్చు. రోజూ ఆకుకూరతోపాటు తాజా పండ్లు తప్పక అందించండి. ఒకపూట గోధుమలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారం లేదా గుగ్గిళ్లు లాంటివి పెట్టండి. ముందు నుంచే పోషక పదార్థాలు తీసుకుంటూ, చక్కటి జీవన శైలిని అవలంబిస్తూ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అప్పుడే వ్యాధులు దరిచేరవు. ఒకవేళ వచ్చినా రోగనిరోధక వ్యవస్థ వాటిని బలంగా ఎదుర్కొంటుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఎముకలు, కండ, నాడులదే కీలకమైన. ఇవి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని కదిలించాలి... అంటే వ్యాయామం తప్పనిసరి. ఆహారంలో పొట్టు తీయని తృణధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు), పప్పుదినుసులు (సెనగలు, పెసలు, అలసందలు), మేలైన కొవ్వులనిచ్చే నూనె గింజలు (నువ్వులు, గడ్డినువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలు), సూక్ష్మపోషకాలనిచ్చే ఆకుకూరలను ఎక్కువగా చేర్చాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర, మెంతి, మునగాకు... వీటిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించాలి. నిమ్మ, ఉసిరి, జామ, అల్లనేరేడు, దానిమ్మ, అంజీరా, నల్లద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ఇవి విటమిన్‌ సిని అందించి, రోగనిరోధక శక్తి, జీర్ణాశయ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మహిళలు తమ నడుము కొలత 80 సెం.మీ. (31.5 అంగుళాలు) లోపు ఉండేలా చూసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను చేసుకుని కుటుంబానికి అందించండి. కాస్త సమయం, కొంత నగదు వెచ్చిస్తే చాలు. దీర్ఘకాలంలో లాభాలు బోలెడు. పోషణ, రక్షణ.. ఈ రెండే మీ పెట్టుబడి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని