అతడితో పెళ్లి వద్దంటోంది!

నా వయసు పాతికేళ్లు. ఎనిమిదేళ్లుగా ఓ అబ్బాయిని  ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మతాలు వేరవడంతో తనతో పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరించడం లేదు. అతను మతం మార్చుకుంటే సరేనంటున్నారు.

Published : 10 Jan 2022 01:33 IST

నా వయసు పాతికేళ్లు. ఎనిమిదేళ్లుగా ఓ అబ్బాయిని  ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా. మా ఇద్దరి మతాలు వేరవడంతో తనతో పెళ్లికి ఇంట్లో వాళ్లు అంగీకరించడం లేదు. అతను మతం మార్చుకుంటే సరేనంటున్నారు. కానీ అతనికది ఇష్టం లేదు. రెండు మతాల పద్ధతుల్లో పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అతడిని చేసుకుంటే అమ్మా... కాదంటే అతనూ చనిపోతామంటున్నారు. తనెంతో మంచివాడు. తను లేకపోతే నాకు జీవితం లేదు.  నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. నేనేం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి.

- ఓ సోదరి

మాజంలో కులమతాలు, పద్ధతులకు ప్రాధాన్యమెక్కువ. తమ పిల్లల పెళ్లిళ్లు తమ మతం వారితోనే జరగాలనుకుంటారు. ఎంత ప్రేమించుకున్నా, ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటే ఇద్దరి ఇళ్లలోనూ వ్యతిరేకత సాధారణమే. అతను మతం మారననడంలో ఆశ్చర్యమేమీ లేదు. తల్లిదండ్రులు చనిపోతామని బెదిరించడమూ మామూలే. పెద్దలు అంగీకరించరనే సంగతి పక్కన పెట్టి, అసలు మీరిద్దరూ కలిసి ఉండటానికి ఇరు కుటుంబాల ఆచారాలు అడ్డు వస్తాయా, వాటిని అధిగమించగలరా, సర్దుకుపోగలరా అనేవి ఆలోచించండి.

రెండు వైపులా సహకారం అందొచ్చు, అందకపోవచ్చు. ఇన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి భావోద్వేగాలకు గురవ్వకుండా ఇద్దరూ సాలోచనగా మాట్లాడుకోండి. రాబోయే ఇబ్బందుల గురించి ఆలోచించండి. తొందరపడి చేసుకుని కొన్నాళ్లయ్యాక నచ్చడంలేదని, వివాదాలు వస్తున్నాయని, మరేదో కారణంతో విడిపోవడం కంటే ఇప్పుడే అన్ని కోణాల్లో చూసుకుంటే మంచిది. భార్యాభర్తల మధ్యా ఏవో పేచీలు, గొడవలు వస్తుంటాయి. వాటి పరిష్కారానికి పెద్దల సాయం కావాలి.

ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమ అన్నిటినీ జయిస్తుంది అని ఈ క్షణంలో అనిపిస్తుంది. కానీ వాస్తవం అలా ఉండదు. సమస్య వచ్చినప్పుడు కూడా ఇదే మాట మీద ఉండగలరా? అని చూడండి. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక ఏడాది మౌనంగా ఉండండి. అప్పటికీ అంతే ప్రేమ ఉంటే అప్పుడు మరోసారి పెద్దలతో మాట్లాడి వారిని మీ పెళ్లికి ఒప్పించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని