మా అమ్మాయీ వాటా కావాలంటోంది!

నాకిద్దరు కొడుకులు, కూతుళ్లు. మా మామ గారికి స్వార్జితం ఎకరం, వారి తండ్రిగారి ఆస్తి ఎకరం కలిపి రెండెకరాలు ఉంది. మా మామయ్య వీలునామా రాయకుండా 2003లో చనిపోయారు. ఆ పొలాన్ని అత్తయ్య తన పేరు

Updated : 29 Feb 2024 18:58 IST

నాకిద్దరు కొడుకులు, కూతుళ్లు. మా మామ గారికి స్వార్జితం ఎకరం, వారి తండ్రిగారి ఆస్తి ఎకరం కలిపి రెండెకరాలు ఉంది. మా మామయ్య వీలునామా రాయకుండా 2003లో చనిపోయారు. ఆ పొలాన్ని అత్తయ్య తన పేరు మీద 2004లో బదలాయించుకున్నారు. దాన్ని 2016లో కొడుకులిద్దరి పేరు మీద సమానంగా పంచి ఇచ్చారు. ఈ పొలాన్ని మా ఇద్దరబ్బాయిలకు పంచుదామని అనుకుంటున్న సమయంలో మా చిన్నమ్మాయి కూడా వాటా కావాలంటోంది. (ఆమెకు పెళ్లి సమయంలో నగదు, నగలూ తదితరాలూ కానుకగా అందించాం). ఇప్పుడు ఆస్తి పంపకాల్లో కూతుళ్ల సంతకాలు కూడా తప్పనిసరా?

- ఓ సోదరి

మీ ఉత్తరాన్ని బట్టి చూస్తే మీ మామగారి ఆస్తి మీ అత్తయ్య పేరు మీద బదలాయింపు జరిగిపోయింది. దాన్ని మీ అత్తయ్య 2016లో తన కొడుకుల పేరు మీద సెటిల్‌మెంట్‌ డీడ్‌లాగా రాసుకుని భాగాలు పంచినట్లు తెలుస్తోంది. కానీ దాన్ని వారి పేరు మీద రిజిస్టర్‌ చేసుకున్నారా లేదా తెలియడం లేదు. మీ మామయ్య ద్వారా వచ్చిన ఆస్తి.. మీ వారి పేరు మీద బదలాయింపు జరిగితే అది ఆయన స్వార్జితపు ఆస్తి కింద పరిగణిస్తారు. 2005లో వచ్చిన హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం కూతురు కూడా పిత్రార్జిత ఆస్తికి జన్మతః వారసురాలు. ఆ సవరణ... భాగం పంచుకోని ఆస్తికే  వర్తిస్తుంది. 2004లో మీ అత్తయ్య పేరు మీద బదలాయింపు జరిగిపోయింది కాబట్టి దాన్ని ఆమె స్వార్జితం కింద పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు ఆవిడ దాన్ని తన ఇష్టం వచ్చిన వారికి ఇవ్వొచ్చు. మీ అత్తగారు కొడుకులకు పంచారు కాబట్టి అది వారి వారి స్వార్జితపు ఆస్తి కింద పరిగణిస్తారు. మీ అమ్మాయికి ఆ ఆస్తిలో హక్కు లేదు. ఎందుకంటే పిత్రార్జితమైనా అది పంపకాలు పూర్తయిన ఆస్తి. అలాంటి ఆస్తిలో మీ అమ్మాయికి మీ వారు ఉన్నంత వరకు హక్కు లేదు. ఒకవేళ మీ భర్త వీలునామా రాయకుండా చనిపోతే అప్పుడు మీ అమ్మాయికి ఆ ఆస్తి పిత్రార్జితం అవుతుంది. ఇలా గొడవలు రాకుండా ఉండాలంటేే అందరూ ఉండగానే వీలునామా రాస్తే మంచిది. అలాగే మీరు కొడుకులకు ఆస్తి పంచి ఇచ్చే సమయంలో మీ కూతుళ్ల సంతకాలు అవసరం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్