నా అవసరాలకు డబ్బు ఇవ్వనంటున్నాడు!

నేనొక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా. 2013లో నా వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి నా జీతమంతా మా వారికే ఇస్తున్నా. అయితే ఇప్పుడు నా కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. మా అత్తింటి వారేమో ఇంట్లోంచి వెళ్లిపోమ్మంటున్నారు. అన్ని రకాల ఆస్తులూ మా ఆయన పేరు మీదే ఉన్నాయి.

Published : 18 Jan 2022 01:11 IST


నేనొక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. పదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నా. 2013లో నా వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి నా జీతమంతా మా వారికే ఇస్తున్నా. అయితే ఇప్పుడు నా కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వడం లేదు. మా అత్తింటి వారేమో ఇంట్లోంచి వెళ్లిపోమ్మంటున్నారు. అన్ని రకాల ఆస్తులూ మా ఆయన పేరు మీదే ఉన్నాయి. నేనిప్పటి దాకా సంపాదించినదంతా నాకు తిరిగి వస్తుందా? అలాగే అతన్నుంచి విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నా. తగిన సలహా ఇవ్వండి.

- ఓ సోదరి, ఇ-మెయిల్‌

మీరు ఉద్యోగం చేసి సంపాదించేదంతా మీ స్వార్జితమే. అది మీరు కుటుంబ ఖర్చుల కోసం ఇచ్చినా తప్పు లేదు. కానీ మీ కనీస అవసరాలకు అతను అస్సలు డబ్బు ఇవ్వకపోవడం అనేది గృహ హింస కిందకు వస్తుంది. అసలు మీ మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఆర్థిక వ్యవహారాలైతే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేసుకోవడం వల్ల కుటుంబం విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది. ఇద్దరి మధ్యా ఎందుకు గొడవలొస్తున్నాయో తెలుసుకుని, కలిసి చర్చించుకుని పరిష్కరించుకోవచ్చు. ఇలా మీ వల్ల సాధ్యం కానప్పుడు మూడో వ్యక్తి సాయం కోరడాన్ని మధ్యవర్తిత్వం అంటారు. మీ భర్త, అత్తింటి వారిని కూడా మంచి ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గరకు పిలిపించి పరిష్కరించుకోగలరేమో ప్రయత్నించండి. లేదంటే చివరి ప్రయత్నంగా న్యాయస్థానానికి వెళ్లడం లేదా పోలీసు స్టేషన్‌కు వెళ్లడం లాంటివి చేయాలి. హిందూ వివాహ చట్టం, సెక్షన్‌ 13 ప్రకారం క్రూరత్వం, వదలి వేయడం, ఇతరత్రా కారణాలు చూపుతూ విడాకులు కోరవచ్చు. ఇంటి అవసరాలకు డబ్బు ఇవ్వకపోవడం, భార్యనే మరింత డబ్బు తెచ్చివ్వమని వేధించడం క్రూరత్వం కిందకు వస్తాయి. విడాకుల కేసులో మీరు ఇచ్చిన కట్నం డబ్బు, మీ జీతం తిరిగి ఇమ్మని కోరవచ్చు. లేదంటే గృహ హింస చట్టం కింద కూడా అందరినీ చేర్చి వారిపై న్యాయ స్థానంలో కేసు వేయండి. విడాకుల కేసులో అందరినీ చేర్చడానికి వీల్లేదు. ఈ రెండు కేసుల్నీ వేర్వేరుగా దాఖలు చేయాలి. మీకు ఏది కావాలో నిర్ణయించుకుని ముందడుగు వేయండి. పిల్లలున్నారా లేదా అన్నది రాయలేదు. పిల్లలుంటే కేసు వేసే ముందు వారి భవిష్యత్తు, చదువులు, పోషణ వంటివీ దృష్టిలో పెట్టుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని