మళ్లీ మళ్లీ వస్తోందేం?

కాలంతా పొట్టులా ఊడుతున్నట్లు అవుతోంది. ఏవైనా క్రీములు రాస్తే అప్పటికి తగ్గుతోంది. కానీ మళ్లీ వెంటనే వస్తోంది. శాశ్వతంగా తగ్గాలంటే ఏం చేయాలి?

Published : 23 Jan 2022 01:01 IST

కాలంతా పొట్టులా ఊడుతున్నట్లు అవుతోంది. ఏవైనా క్రీములు రాస్తే అప్పటికి తగ్గుతోంది. కానీ మళ్లీ వెంటనే వస్తోంది. శాశ్వతంగా తగ్గాలంటే ఏం చేయాలి?

- ఓ సోదరి

ఇందుకు చాలా కారణాలుంటాయి. బాగా బిగుతుగా ఉండే షూ, ఆరని సాక్సులు వేసుకోడం, ఒకే జతను పలుమార్లు వాడటం వల్ల కనిపిస్తుంది. రసాయనాలు, అశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో నడిచినా, వేరే వాళ్ల చెప్పులు వేసుకున్నా వస్తుంటుంది. యాంటీ ఫంగల్‌ మందుల్ని ట్యాబెట్లు, పూతల రూపంలో వాడాలి. స్నానం చేయగానే కాళ్లను తడిలేకుండా శుభ్రంగా తుడుచుకుని మాయిశ్చరైజర్‌, టాల్కమ్‌ పౌడర్‌ రాయాలి. పొడిగా, శుభ్రంగా ఉన్న సాక్సులు వేసుకోవడం, తరచూ షూ మార్చడం చేయాలి.

* ఎగ్జిమా.. ఎరుపుదనం, దద్దుర్లు, దురద వంటివి లక్షణాలు. దీనికి ఫలానా కారణమని చెప్పలేం. ఎక్కువగా వారసత్వమే. యాంటీ హిస్టమిన్‌, టాపికల్‌ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు రాయడం ద్వారా తగ్గించుకోవచ్చు.

* సొరియాసిస్‌ వల్లా అవొచ్చు. అయితే దీర్ఘకాలంపాటు ఉంటుంది. ఎక్కువ మొత్తంలో చర్మకణాల వృద్ధి చెందడమే ఇందుకు కారణం. చలికాలంలో ఎక్కువవుతుంది. శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. చాలామందిలో అరికాళ్లలో కనిపిస్తుంది. ఇదీ వంశపారంపర్యమే. మాయిశ్చరైజర్‌, సాల్సిలిక్‌ ఆసిడ్‌ క్రీమ్‌లు, ఫొటో థెరపీ, యాంటీ హిస్టమిన్స్‌ ద్వారా తగ్గించుకోవచ్చు. అతి చెమటా కారణమే. అల్యూమినియం ఫ్లోరైడ్‌ ద్రావణాన్ని రాయడం, ఆరు నెలలకోసారి బొటాక్స్‌ చేయిస్తే అదుపులోకి వస్తుంది.

* పొడిచర్మం ఉన్నవాళ్లలో చలికాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. మీకిదే కారణమనిపిస్తోంది. తేమ తక్కువ వాతావరణం, బాగా వేడినీటితో స్నానం, తక్కువ నీటిని తాగడం, ఎక్కువగా ఎండలో తిరగడం, ఒత్తిడి.. ఈ సమస్యకు కారణాలు. వీళ్లు రోజులో కనీసం నాలుగైదుసార్లు మాయిశ్చరైజర్‌ రాస్తుండాలి. అయినా తగ్గకపోతే హైడ్రోకార్టజాన్‌ లేదా యూరియా సాల్సిలిక్‌ ఆసిడ్‌, ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్‌ కలిపి ఉన్న క్రీమ్‌లను తరచూ రాస్తుండండి. గదిలో హ్యుమిడిఫయర్‌ను ఏర్పాటు చేసుకోండి. సబ్బును తక్కువగా వాడటంతోపాటు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి. రాత్రుళ్లు 20 నిమిషాలపాటు కాళ్లను నీళ్లలో నాననిచ్చి, శుభ్రం చేయాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాసి, సాక్సు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని