విషయం చెప్పాక.. వివక్షకు గురవుతున్నా!
ఆరు నెలల గర్భవతిని. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే మా పై అధికారికి తెలియజేశాను. వీలైనంత వరకూ పనిచేస్తే.. బిడ్డ పుట్టాక ప్రసూతి సెలవుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చన్నది నా ఆలోచన.
ఆరు నెలల గర్భవతిని. ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే మా పై అధికారికి తెలియజేశాను. వీలైనంత వరకూ పనిచేస్తే.. బిడ్డ పుట్టాక ప్రసూతి సెలవుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చన్నది నా ఆలోచన. కానీ ప్రెగ్నెన్సీ గురించి తెలిసినప్పటి నుంచీ ఆఫీసులో నాకు తక్కువ పనిని అప్పగిస్తున్నారు. వివక్షకు గురవుతున్నా అనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడమెలా?
సుప్రియ, గుంటూరు
విషయం విన్నాక ‘అభినందనలు’ అని నవ్వుతూ చెప్పినా అధికారి అంతర్గత స్పందన మాత్రం ‘ఆడవాళ్లను నియమించుకుంటే ఇదే సమస్య’ అనే! అకస్మాత్తుగా ప్రతిదీ మారుతుంది. తక్కువ పని, ప్రాధాన్యం లేనివివ్వడం, మీ ప్రాజెక్టులు, క్లయింట్లను ఇతరులకు అప్పగించడం చేస్తారు. ఒక్కోసారి ఇతరుల తప్పులకూ బాధ్యుల్ని చేస్తారు. గతంలో ఎప్పుడూ లేని ప్రతికూల ఫీడ్‌బ్యాక్ కూడా వస్తుంది. ఇవన్నీ చూస్తే.. మీ పైవాళ్లు ‘ఇక మీ అవసరం మాకు లేదు’ అని చెబుతున్నట్లే అనిపిస్తుంది. ఇక ప్రసూతి సెలవులయ్యాక.. కొందరు ‘నీ పనినంతా మేం చేయాల్సి వచ్చింద’న్న ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. ఇన్నిరోజులు పనికి దూరంగా ఉండటంతో మీరు వెనకబడి ఉంటారని మీ పైవాళ్లు భావిస్తుంటారు. దీంతో మీటింగ్, అవకాశాలు, పదోన్నతుల్లో పక్కన పెట్టేస్తారు. ఈ ప్రవర్తనతో నిరాశ చెందడమూ సహజమే. కానీ మీకూ కొన్ని అధికారాలున్నాయి. యజమానులు గర్భం, తల్లి పాలివ్వడం వంటి పరిస్థితుల కారణంగా ఉద్యోగిని నియమించుకోవడానికి, తొలగించడానికి వీల్లేదు. మీరు వివక్ష లేదా ప్రతీకారానికి గురవుతున్నట్లు భావిస్తే.. మీరు ఎదుర్కొంటున్న ప్రతిదాన్నీ నోట్ చేసుకోండి. మర్చిపోతున్నామనిపిస్తే మీకు మీరే ఈమెయిల్ చేసుకోండి. అప్పుడు సమయమూ పక్కాగా ఉంటుంది కాబట్టి, కావాలని చెబుతున్నారని ఎవరూ నిందించలేరు. మిమ్మల్ని తొలగించే అవకాశమివ్వకండి. వాళ్లు మిమ్మల్ని తొలగించినా మీ పనితీరు, యోగ్యతలో ఏ తప్పునూ చూపించలేకపోతే అది వారికే ఇబ్బంది. కాబట్టి నిస్సహాయంగా భావించకండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.