చాలా అసూయగా ఉంది...
నేను, నా స్నేహితురాలు ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరికీ ఒకబ్బాయితో స్నేహం కుదిరింది. ఎక్కడికి వెళ్లినా ముగ్గురం కలిసే వెళ్తాం. కానీ వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఈమధ్యే తెలిసింది. ఈ విషయాన్ని నాకు చెప్పకపోవడం బాధగా, మరోపక్క అసూయగా ఉంది.
నేను, నా స్నేహితురాలు ఒకేలా ఆలోచిస్తాం. మా ఇద్దరికీ ఒకబ్బాయితో స్నేహం కుదిరింది. ఎక్కడికి వెళ్లినా ముగ్గురం కలిసే వెళ్తాం. కానీ వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని ఈమధ్యే తెలిసింది. ఈ విషయాన్ని నాకు చెప్పకపోవడం బాధగా, మరోపక్క అసూయగా ఉంది. వాళ్లిద్దరూ నాతో ఆడుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆమెతో ఇదివరకటిలా ఉండలేకపోతున్నాను.
- ఓ సోదరి, విజయవాడ
ఎందరితోనయినా స్నేహంగా ఉండొచ్చు. కానీ ప్రేమ ఒక్కరి మీదే కలుగుతుంది తప్ప ఇద్దరు ముగ్గురు మీద కలగదు కదా! స్నేహం వేరు, ప్రేమ, పెళ్లిచేసుకోవడం వేరని అర్థంచేసుకోవాలి. అతనికి నచ్చే గుణాలు ఆమెలో లేదా ఆమె ఇష్టపడే లక్షణాలు అతనిలో ఉండటం వల్ల వాళ్లిద్దరూ చేరువై ఉండొచ్చు. అది ప్రేమని వాళ్లక్కూడా ఇంకా తెలిసి ఉండకపోవచ్చు. స్పష్టత లేకుండా మూడో వ్యక్తికి చెప్పలేరుగా! వాళ్లు నిర్ధారించుకుని, నిర్ణయించుకున్నాక చెబుతారు. అది వాళ్ల వ్యక్తిగత విషయం. దాన్ని తప్పుగా తీసుకోకూడదు. వాళ్లిద్దరూ ఒకర్నొకరు ఇష్టపడుతున్నారని గ్రహించినప్పుడు స్నేహితురాలిగా సంతోషించాలి. మిత్రుల మధ్య ఇలాంటి ఆలోచనలే రాకూడదు. ఒకవేళ మీరు అతన్ని ఇష్టపడి ఉంటే వాళ్లిద్దరూ పరస్పరం కోరుకుంటున్నారని తెలిశాక ఆ అనుబంధాన్ని సహృదయంతో గౌరవించాలి. ఈర్ష్య లేకుండా వారి ప్రేమను ఆమోదిస్తే కోపం, ద్వేషం కలగవు. అది వాళ్లకీ మీకూ కూడా మంచిది. ఇద్దరూ మీకు స్నేహితులే కనుక భవిష్యత్తులోనూ మీ మధ్య ఆ అనుబంధం ఉంటుంది. ఎవరికెలా నిర్ణయించి ఉందో అదే జరుగుతుందని అర్థంచేసుకుని మునుపటిలానే స్నేహంగా ఉండండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.