మావారే గుర్తొస్తున్నారు...

నా వయసు 30. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఈ మధ్యే మా వారు కొవిడ్‌తో చనిపోయారు. ఆ దుఃఖం నుంచి బయటకు రాలేక పోతున్నాను. దేనిమీదా దృష్టి పెట్టలేక పోతున్నాను. ఈ వేదన నుంచి బయటపడటానికి మార్గం సూచించండి..

Published : 13 Feb 2022 00:29 IST

* నా వయసు 30. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఈ మధ్యే మా వారు కొవిడ్‌తో చనిపోయారు. ఆ దుఃఖం నుంచి బయటకు రాలేక పోతున్నాను. దేనిమీదా దృష్టి పెట్టలేక పోతున్నాను. ఈ వేదన నుంచి బయటపడటానికి మార్గం సూచించండి..

- ఓ సోదరి, కర్నూలు

* జీవిత భాగస్వామిని కోల్పోవడం అతి ముఖ్యమైన ఒత్తిడి కారణంగా తేలింది. ఆ వ్యక్తితో ఉన్న అన్యోన్యతను బట్టి దుఃఖ తీవ్రత ఉంటుంది. అనుబంధాన్ని పెనవేసుకోవలసిన చిన్న వయసులో అనుకోండా మీ భర్త పోవడంతో తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు లేకపోవడం, అకస్మాత్తుగా విపత్తు ముంచుకు రావడం లాంటివి మరీ కుంగదీస్తాయి. ఇలాంటి సందర్భంలో కుటుంబసభ్యులు లేదా స్నేహితుల ఆసరా అవసరం. వారి సాయంతో ఈ ఆలోచనల నుంచి పక్కకు మళ్లాలి. బాధాకరమే అయినా ఆ దుఃఖం నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. అతను చనిపోయిన పరిస్థితి, పడిన బాధ, ఏమీ చేయలేకపోయానన్న పశ్చాత్తాపం, దక్కించుకోలేకపోయానన్న వేదన, తోడుగా లేకపోవడం ఇవన్నీ మిళితమై ఉంటాయి. దీన్ని గ్రీఫ్‌ రియాక్షన్‌ అంటారు. అతను పడిన ఆవేదన పదేపదే గుర్తుకురావడం, లేదా కలల్లో కనిపించడం, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు అవే విషయాలు దొర్లుతుండటం.. దీన్ని పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పిటిఎస్‌డి) అంటారు. మీరు మానసిక వైద్యుని సంప్రదిస్తే ఫలితం ఉంటుంది. కొందరిలో ఆ వ్యక్తి చనిపోలేదు, బతికే ఉన్నారన్న భ్రమ ఉంటుంది. ఇంకొందరిలో కోపం కనిపిస్తుంది. కొన్నాళ్లకు సర్దుకుపోవడం ఏదైనా మంచి జరిగితే బాగుండు అనుకోవడం లాంటి గ్రీఫ్‌ రియాక్షన్లు ఉంటాయి. కొందరు కుంగుబాటులోకి వెళ్తారు. కొన్నాళ్లకు స్థిమితపడతారు. అలా తేరుకుని నిబ్బరంగా ఉండలేకపోతే డిప్రెషన్‌ మిగిలి పోతుంది. కనుక మీరు వెంటనే మానసిక వైద్యుని సంప్రదించడం మంచిది. గ్రీఫ్‌ రియాక్షన్‌ అనేది కాంప్లికేట్‌ అయ్యిందా లేక పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డరా (పిటిఎస్‌డి) అనేది అంచనా వేస్తారు. ఆకలి, నిద్రలేమి, మనసును కేంద్రీకరించలేకపోవడం, మతిమరపు, దైనందిన జీవితం సక్రమంగా లేకపోవడం.. ఇవన్నీ పరిశీలించి కౌన్సెలింగ్‌ ఇస్తారు. అవసరమైతే యాంటీ డిప్రెసెంట్స్‌ సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని