అలా చెప్పలేకపోతున్నా..!

నిరంతర ఫీడ్‌బ్యాక్‌, అభివృద్ధి అంశాలను సూచించే హోదాలో ఉన్నా. ఇది కష్టమైన పని అని నా ఉద్దేశం. ప్రతికూల ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఫలానాది మార్చుకో అని చెప్పలేకపోతున్నా. నా పనిని నేను సమర్థంగా నిర్వహించాలంటే ఇంకా ఏ నైపుణ్యాలు కావాలి?....

Published : 17 Feb 2022 00:25 IST

నిరంతర ఫీడ్‌బ్యాక్‌, అభివృద్ధి అంశాలను సూచించే హోదాలో ఉన్నా. ఇది కష్టమైన పని అని నా ఉద్దేశం. ప్రతికూల ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఫలానాది మార్చుకో అని చెప్పలేకపోతున్నా. నా పనిని నేను సమర్థంగా నిర్వహించాలంటే ఇంకా ఏ నైపుణ్యాలు కావాలి?

- అనురాధ, హైదరాబాద్‌


ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వాల్సి రావడం మామూలే. చాలామంది పనిలో సంభాషణలు, కెరియర్‌ ప్రయోజనాలు, నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని గ్రహించలేరు. ఫీడ్‌బ్యాక్‌ వారిని సరైన మార్గంలో నడిపించడానికి సాయపడుతుంది. ఇది సానుకూలంగా ముగియాలన్నది మీ ఆలోచన. అయితే ఈ అంశాలను గుర్తుంచుకోండి.

దేన్నైనా చెప్పే ముందు సరైన ప్రణాళిక వేసుకోండి. ఇదీ పరిస్థితి అని చెప్పడానికే పరిమితమవకండి. దీనివల్ల కీడే ఎక్కువ. ఏవిధంగా చెప్పాలి, ఎలా చెబితే సానుకూలంగా ఉంటుందన్నది ఆలోచించుకుని ఆ విధానాన్ని అనుసరించండి. అవసరమైతే దాన్ని సరిచేసుకోవడానికి తగిన సూచనలూ జత చేయండి. ఫీడ్‌బ్యాక్‌ అందుకున్నవారూ సానుకూలంగా తీసుకోగలుగుతారు. మాట్లాడాలనుకున్న అంశాలన్నీ పాయింట్లుగా రాసుకుంటే చెప్పడానికి మీకూ సులువవుతుంది.

సమయం, ప్రదేశాన్నీ చూసుకోవాలి. ఇప్పుడన్నీ ఓపెన్‌ వర్క్‌ప్లేస్‌లే! ఎంత నెమ్మదిగా చెప్పినా పక్కవారికి చేరొచ్చు. అది వారికి అవమానంలా తోయొచ్చు. కాబట్టి, పక్కకు పిలిచి చెప్పడం లాంటివి చేయండి. అలాగే ఏదైనా మీటింగ్‌, అత్యవసర పనిలో ఉన్నప్పుడూ చెప్పకండి. చేయబోయే పని నుంచి మనసు పక్కకు మళ్లుతుంది. నేరుగానూ చెప్పొద్దు. ‘ఫలానా ప్రాజెక్టు కలిసి ఎలా చేయాలో ఓసారి చర్చిద్దామా?’, ‘... పనిలో కొన్ని సలహాలు కావాలి’ లాంటివి చెబితే మేలు.

నేరుగానూ విమర్శించొద్దు. ‘ఫలానా వ్యక్తితో/ సందర్భంలో ఇలా ప్రవర్తించావ్‌’ అనడం కంటే.. ఆ తీరు బృందం, పనిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థమయ్యేలా చెప్పండి. ఏం చేయాలనుకుంటున్నారో కూడా వాళ్లనే అడగొచ్చు. అవసరమైతే మార్పులు సూచించొచ్చు. ఇవన్నీ సానుకూలంగా పనిచేసే విధానాలే. వీటిని ప్రయత్నించి చూడండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని