మంగుమచ్చ పోయేదెలా?
నా వయసు 25. చెంపల మీదా మంగు మచ్చల్లా వచ్చాయి. బయటకెళితే చాలా ఇబ్బందిగా ఉంటోంది. మెడికల్ షాప్ నుంచి క్రీమ్ తెచ్చి వాడి చూశా. ఫలితం లేదు. పోయే మార్గం చెప్పండి.
నా వయసు 25. చెంపల మీదా మంగు మచ్చల్లా వచ్చాయి. బయటకెళితే చాలా ఇబ్బందిగా ఉంటోంది. మెడికల్ షాప్ నుంచి క్రీమ్ తెచ్చి వాడి చూశా. ఫలితం లేదు. పోయే మార్గం చెప్పండి.
- ఓ సోదరి
దీన్ని మెలాస్మా అంటాం. దీనికి ఫలానా కారణమని కచ్చితంగా చెప్పలేం. ఎక్కువగా వంశపారంపర్యం. గర్భిణుల్లో అధికంగా కనిపిస్తుంది. కానీ తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా, హార్మోను సమస్యలున్నా, పీసీఓఎస్, నెలసరి క్రమంగా రాక సంబంధిత మాత్రలు వాడుతోన్నా ఇది రావొచ్చు.
ఫిట్స్, హైపో థైరాయిడిజం, సైకియాట్రీ సంబంధిత మందులు వాడేవారు, ల్యాప్‌టాప్, స్క్రీన్‌ల ముందు ఎక్కువగా ఉండేవాళ్లు, హెయిర్ డై వేసుకునేవాళ్లు, ఎండకు ఎక్కువగా తిరిగేవాళ్లలోనూ కనిపిస్తుంటుంది. చాలావరకూ కొంతకాలం తర్వాత తగ్గిపోతాయి. కొందరిలో మాత్రం విస్తరిస్తుంటాయి.
హైడ్రోక్వినాన్, ఎజిలాయిక్ ఆసిడ్, కోజిక్ ఆసిడ్ ఉన్న క్రీమ్‌లను వాడండి. బయటకు వెళ్లేటప్పుడు జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్ ఉన్న సన్‌స్క్రీన్ క్రీమ్‌లు కనీసం ఎస్‌పీఎఫ్ 30 ఉన్నదాన్ని తప్పక రాయాలి. వీలైనంతవరకూ ఎండలో తిరగకుండా చూసుకోండి. ఇంకా.. మాండలిక్ ఆసిడ్, గ్లైకాలిక్ ఆసిడ్, కోజిక్ ఆసిడ్, రెటినాయిక్ ఆసిడ్ వంటి కెమికల్ పీల్స్ చేయించుకోవచ్చు. మైక్రోడర్మాబ్రేషన్‌తోపాటు లేజర్, లైట్ థెరపీల ద్వారా కూడా చాలావరకూ తగ్గించొచ్చు.
వీటిలోనూ ఎపిడర్మల్, డర్మల్ అని రెండు రకాలుంటాయి. ఎపిడర్మల్ పై చికిత్సలతో త్వరగా తగ్గుతుంది. డర్మల్‌వి కాస్త కష్టం. ముందు వైద్యున్ని కలిసి, వారి సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవడం మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.