ఆస్తి.. నా భర్తకీ కొడుక్కీ వస్తుందా?

మా మామగారికి వారసత్వంగా తాతల నుంచి పొలం వచ్చింది. దాన్ని ఆయన చనిపోయాక మొదటి భార్య తన పేరిట మార్చుకుందమావారు రెండో భార్య కొడుకు. పెద్దావిడకు పిల్లలు లేరని మా అత్తగారిని

Published : 23 Feb 2022 00:35 IST

మా మామగారికి వారసత్వంగా తాతల నుంచి పొలం వచ్చింది. దాన్ని ఆయన చనిపోయాక మొదటి భార్య తన పేరిట మార్చుకుందమావారు రెండో భార్య కొడుకు. పెద్దావిడకు పిల్లలు లేరని మా అత్తగారిని చేసుకున్నారు. ఇప్పుడు మా అత్తగారూ చనిపోయారు. పెద్దత్తయ్య తన పేరు మీద ఉన్న పొలానికి నామినీగా తన మేనల్లుడి పేరును రాయించింది. మావారికి 49 ఏళ్లు. మధు మేహం, ఆస్తమా... ఆరోగ్యం సరిగా ఉండదు. నేనే చిన్నా చితకా పనులు చేస్తూ ఇంటిని నడుపుతున్నా. మరే జీవనాధారమూ లేదు. తాతల నుంచి వచ్చిన ఆస్తిలో నా భర్త, కొడుక్కి (13 ఏళ్లు) హక్కు ఉండదా?

- స్వాతి, హైదరాబాద్‌

మీ మామగారి పొలం పిత్రార్జితమైతే ఆయన చనిపోయాక మీ పెద్దత్తయ్యకు తన పేరు మీద మార్చుకునే హక్కు లేదు. ఎందుకంటే హిందూ వారసత్వ చట్టం-1956, సెక్షన్‌-8 ప్రకారం ఎవరైనా పురుషుడు వీలునామా రాయకుండా చనిపోతే అతని స్వార్జితపు ఆస్తి, పిత్రార్జితపు ఆస్తి అతడి తదనంతరం మొదటి వారసులు... అంటే కొడుకు, కూతురు, భార్య, తల్లి, చనిపోయిన కొడుకు భార్య, పిల్లలు; చనిపోయిన కూతురి పిల్లలు, చనిపోయిన మనవడి భార్య, పిల్లలు; ఇంకా ఆ క్రమంలో ఉన్నవారికి రావాలి. మీ అత్తయ్య తన పేరు మీద చేయించుకున్న పట్టాలు లేదా మ్యుటేషన్‌ చెల్లదు కాబట్టి న్యాయస్థానంలో దావా వేసి రద్దు చేయమని అడగండి. అది జరిగి ఎన్నాళ్లయ్యిందో తెలియదు. కాబట్టి ముందుగా ఎప్పుడు మార్పించుకున్నారు? ఎలా మార్పించుకున్నారు అనేవి తెలియాలి. మీ పెద్దత్తయ్య తన పేరు మీద చేయించుకున్నదే చెల్లదు కాబట్టి ఆవిడ తన మేనల్లుడి పేరును నామినీగా రాయడానికి హక్కు లేదు. ఎలాంటి బదలాయింపులూ జరగకుండానే వీలైనంత తొందరగా ఆస్తికి సంబంధించిన కాగితాలు సంపాదిస్తే దాన్ని బట్టి ఆస్తిని తిరిగి తీసుకోవడానికి మీవారికి, పిల్లాడికి రావాలని భాగస్వామ్యపు లేదా వారసత్వ హక్కు పునరుద్ధరణ దావా వేయడానికి వీలవుతుంది. కాబట్టి ముందు ఆస్తి కాగితాల కోసం రెవెన్యూ రికార్డులు, మీ పెద్దత్తయ్య పేరు మీద మార్పించుకున్న పత్రాలు సంపాదించండి. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వారిని సంప్రదిస్తే మీకు న్యాయవాదిని ఏర్పాటు చేసి, వీలైతే సయోధ్య కుదిర్చి మీ ఆస్తి మీకు తిరిగి వచ్చే ఏర్పాటు చేస్తారు. ముందు ఆ ప్రయత్నంలో ఉండండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని