బరువు మాత్రమే తగ్గాలనుకుంటున్నా!
నా వయసు 20. ఎత్తు 4.7. బరువు 59 కిలోలు. హిమోగ్లోబిన్ శాతం 11 గ్రా. వ్యాయామం, ఆహారంలో మార్పులు చేసినా బరువు తగ్గడం లేదు. వేటి మీదా దృష్టి పెట్టలేకపోతున్నా. హిమోగ్లోబిన్ తగ్గకుండా బరువెలా తగ్గాలి? ...
నా వయసు 20. ఎత్తు 4.7. బరువు 59 కిలోలు. హిమోగ్లోబిన్ శాతం 11 గ్రా. వ్యాయామం, ఆహారంలో మార్పులు చేసినా బరువు తగ్గడం లేదు. వేటి మీదా దృష్టి పెట్టలేకపోతున్నా. హిమోగ్లోబిన్ తగ్గకుండా బరువెలా తగ్గాలి?
- ఓ సోదరి, మంగుళూరు
హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నా శరీరంలో నీరు చేరొచ్చు. ఐరన్, ప్రొటీన్లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఇతర పోషకాలు శరీరానికి సరిగ్గా అందకపోయినా, వేరే ఆరోగ్య సమస్యలున్నా ఈ ఇబ్బంది రావొచ్చు. మీరు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువే ఉన్నారు. అంటే ఊబకాయానికి అతి దగ్గరగా ఉన్నారు. హిమోగ్లోబిన్ శాతం 11 గ్రా., ఉన్నా.. దాన్ని రక్తహీనత కిందకే లెక్కగట్టాలి. ఎందుకంటే ప్రస్తుతానికి సరిపడా మాత్రమే ఉంది. అలసట, నిస్సత్తువగా అనిపిస్తే మీరు హిమోగ్లోబిన్ శాతం మీద ఆధారపడకుండా శరీరంలో ఇనుము నిల్వలు ఎంతున్నాయో కనుక్కునేందుకు ఫెరిటిన్ పరీక్ష చేయించుకోవాలి. బి-12 స్థాయులు, థైరాయిడ్ పనితీరు సరి చూసుకోవాలి. కొన్ని పరీక్షలతో రక్తహీనతకు కారణం తెలుసుకోవచ్చు. బరువు తగ్గాలనుకున్నప్పుడు ప్రత్యేకంగా పోషకాల మీద దృష్టి పెట్టాలి. మీలా రక్తహీనత సమస్య ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా బరువు తగ్గాలి. లేదంటే వేరే అనారోగ్యాల బారిన పడతారు.
ఇనుము కావాలంటే..
మాంసకృత్తుల కోసం రోజులో 300 గ్రా., పాలు, పెరుగు, 20-30 గ్రా., సోయా నగ్గెట్‌్్స తీసుకోవచ్చు. వాటికి బదులు ప్రొటీన్ సప్లిమెంట్లు వాడొచ్చు. మాంసాహారులైతే రోజూ గుడ్డు, దీంతోపాటు చికెన్/మటన్‌ను 100 గ్రా., ఆహారంలో చేర్చుకోవాలి. విటమిన్-సి ఉన్న ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడే ఇనుము శరీరానికి వంటపడుతుంది. నిమ్మరసం చల్లిన ఆహారం లేదా విటమిన్-సి ఎక్కువగా ఉండే జామ, బత్తాయి, కమలా, ఉసిరి.. లాంటివి తీసుకోవాలి. ఇనుము కోసం ఒక పూట రాగి, సజ్జలతో చేసిన చపాతీ/ ఉప్మా, ఇడ్లీ తినొచ్చు.
ఆకుకూరలను బాగా ఉడికించి తినాలి. సెనగలు, పెసలు, రాజ్మా.. ఇలా పొట్టుతో ఉన్న పప్పుదినుసులను మెత్తగా ఉడికించి, నిమ్మరసం కలిపి తీసుకున్నా మేలు లేదా వైద్యుల సలహాతో ఐరన్, బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్-సి మాత్రలను వాడాలి. సమతుల ఆహారం, ఎక్కువ కెలొరీలను కరిగించే వ్యాయామాల మీద దృష్టి పెట్టినప్పుడు బరువు నియంత్రణలో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.