మేమిద్దరం ఏం తినాలి?

నాకు 28 ఏళ్లు. ఎత్తు 5.3. బరువు 53 కిలోలు ఉండేదాన్ని. నాకిపుడు ఏడో నెల.. 57 కిలోలున్నా. 11 నెలల పాప ఉంది. తన బరువు 7.8 కిలోలు.  నేనో టీచర్‌ని. రోజూ 50కి.మీ. ప్రయాణిస్తా. పాప,నేను బలహీనంగా ఉన్నాం. మాతోపాటు పొట్టలో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Published : 23 Mar 2022 01:31 IST

నాకు 28 ఏళ్లు. ఎత్తు 5.3. బరువు 53 కిలోలు ఉండేదాన్ని. నాకిపుడు ఏడో నెల.. 57 కిలోలున్నా. 11 నెలల పాప ఉంది. తన బరువు 7.8 కిలోలు.  నేనో టీచర్‌ని. రోజూ 50కి.మీ. ప్రయాణిస్తా. పాప,నేను బలహీనంగా ఉన్నాం. మాతోపాటు పొట్టలో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- ఓ సోదరి.  

గంటల ప్రయాణం, వృత్తి, పాప బాధ్యతలు... వీటితో శారీరక శ్రమ పెరిగింది. దాంతోపాటు శరీరంలో పోషకాలు, కొవ్వు, హిమోగ్లోబిన్‌ శాతం తగ్గి ఉండొచ్చు. ఫలితంగా బలహీనపడిపోతున్నారు.   మొత్తం ప్రెగ్నెన్సీలో 12 కిలోలు పెరగాలి. 7- 9 నెలల్లో బిడ్డ బరువు పెరుగుదల చాలా కీలకం. దానికి తగ్గట్లుగా శక్తిమంతమైన, ప్రొటీన్‌ భరిత ఆహారాన్ని తినాలి. మొదటిపాపకు పాలిచ్చే దశ నుంచి మళ్లీ గర్భం ధరించిన దశకు వెళ్లారు కాబట్టి పోషకాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. రోజూ కనీసం 2500 కెలొరీలు, 80 గ్రా., ప్రొటీన్లను తీసుకోవాలి. నీరసంగా ఉంటే హిమోగ్లోబిన్‌ శాతం చెక్‌ చేయించుకోవాలి.

ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఇనుము, ఫోలిక్‌ యాసిడ్‌, బి-కాంప్లెక్స్‌, విటమిన్‌-సి ఉండే పదార్థాలు తీసుకోవాలి. మటన్‌, గుడ్డు, చికెన్‌, ఎండు ఖర్జూరం, ఆకుకూరలు, పొట్టుతో ఉన్న శనగల్లో ఇనుము దండిగా ఉంటుంది. ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, గోరుచిక్కుడు, పెసల నుంచి ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. విటమిన్‌-సి కోసం నిమ్మ, ఉసిరి, జామ, క్యాప్సికమ్‌, నారింజల్నీ.. మేలైన మాంసకృత్తులకు సోయా నగ్గెట్స్‌, పప్పులు, గుడ్లు, పాలు, పెరుగూ.. క్యాల్షియం ఎక్కువగా ఉండే రాగులు, సోయాపాలు తీసుకోవాలి. పల్లీపట్టీ, ఎండు ఖర్జూరం, నిమ్మరసం, పండ్లు మధ్యమధ్యలో తీసుకోవాలి. పొంగలి, ఇడ్లీ-పల్లీ చట్నీ, ఉడకపెట్టిన శనగలు, బొబ్బర్లతో చేసిన గుగ్గిళ్లు, అరటిపండు, డేట్స్‌, ఆమ్లెట్‌, ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌, పీనట్‌ బటర్‌తో ఫ్రెంచ్‌ టోస్ట్‌.. ఇవన్నీ తక్షణ శక్తినిస్తాయి. వీటితో వారంలో మీ బరువు అర కేజీ అన్నా పెరగాలి.
మీ పాప బరువు తగ్గిందనుకుంటే వెంటనే పోషకాలను పెంచి ఆహారాన్ని ఇవ్వాలి. మీ పాలు సరిగా అందకపోతే టోన్డ్‌ పాలు తాగించొచ్చు. పాపకు పదకొండు నెలలు కాబట్టి పెద్దవాళ్లు తినే ఆహారాన్ని బాగా ఉడకబెట్టి, మెత్తగా మెదిపి పెట్టొచ్చు. పప్పన్నం, పెరుగన్నం, ఇడ్లీ, రాగి జావ, ఉడికించిన చికెన్‌ను అన్నంతో కలిపి పెట్టొచ్చు. బొప్పాయి వంటి పండ్లని ఇవ్వండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని