Updated : 26/03/2022 03:29 IST

జ్ఞాపకాలు బాధిస్తున్నాయి...

నా ఇద్దరు చెల్లెళ్లూ కొన్నాళ్లక్రితం అనారోగ్యంతో చనిపోయారు. మా మధ్య అనుబంధం బాగా ఎక్కువ. నాకు పెళ్లై కుటుంబం ఉన్నా.. వాళ్లు లేని లోటు బాధిస్తోంది. ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. ఉద్యోగం, ఇంటి పనులతో సాధ్యమైనంత బిజీగానే ఉంటున్నా.. వాళ్లే గుర్తొస్తున్నారు. ఈ బాధ నుంచి బయటపడేదెలా? 

- ఓ సోదరి, హైదరాబాద్‌

మ్మాయిలకు పుట్టింటి వారితో ఎంత మమకారమున్నా పెళ్లయ్యాక ఇటువైపు మళ్లి అది పలచబడుతుంది. కాలం గడిచి, బరువు బాధ్యతలు ఎక్కువయ్యే కొద్దీ ఉద్వేగాలు తగ్గుతాయి. కానీ మీ విషయంలో ఆ అనురాగం భర్త, పిల్లల వైపు మళ్ల లేదు. కొన్ని బాధ్యతలు బదిలీ కాలేదు. సాధారణంగా ఆత్మీయులు చనిపోయిన ఆరు నెలల తర్వాత దుఃఖం తగ్గుతుంది. ఇన్నాళ్లైనా బాధ పడుతున్నారంటే అది కాంప్లికేటెడ్‌ గ్రీఫ్‌. మీరు ముగ్గురూ ఆడపిల్లలు కావడం, ప్రేమగా, సఖ్యతగా పెరగడం, భావాలు పంచుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకోవడం.. అలా అనుబంధం పటిష్టంగా ఉండి ఉండొచ్చు. పెళ్లయిన తర్వాత కూడా ఆ అనుబంధాన్ని కొనసాగించి ఉంటారు. ఇప్పుడు వాళ్లు లేరనే బాధ, మీ కళ్ల ముందే చనిపోవడం వల్ల కుమిలిపోతున్నారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే పోయినవాళ్ల గుర్తులు ఉండాలే కానీ అవే ఆలోచిస్తూ బాధ్యతల నుంచి దూరమయ్యేంత దిగులు పడకూడదు. వాళ్లతో గడిపిన సంతోషకర క్షణాలను, పంచుకున్న విషయాలనే తలచుకోండి. జీవితం ఒక రైలు ప్రయాణం. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్లు వెళ్లిపోతారు. ఈ విషయాన్ని చెప్పుకొంటూ ఉండండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఉద్వేగాల నియంత్రణకు సైకియాట్రిస్టును కలవండి. యాంటీ డిప్రెసెంట్‌ టాబ్లెట్లు, రీగ్రీఫ్‌ థెరపీ ఇచ్చి, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ నేర్పిస్తారు. నచ్చిన వ్యాపకాలు, బంధుమిత్రుల సాన్నిహిత్యం, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న రోగులకు లేదా వారి కుటుంబాలకు సాయం చేయడం- ఇలా మీ మనసును మళ్లించుకోండి. బాధ తగ్గి ఉపశమనం కలుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్