చర్మం బిగుతుగా అవ్వాలంటే..

నుదురు, కంటి దగ్గర ముడతలతోపాటు నల్లగా మారుతోంది. ముఖ చర్మం బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి?  

Updated : 03 Apr 2022 06:36 IST

నుదురు, కంటి దగ్గర ముడతలతోపాటు నల్లగా మారుతోంది. ముఖ చర్మం బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

వయసు పెరుగుతున్నప్పుడు ఇవన్నీ సాధారణమే. కొందరిలో 30 ఏళ్లకే కనిపిస్తున్నాయి. ముందు సబ్బు బదులు మైల్డ్‌ క్లెన్సర్‌కి మారండి. పొడి చర్మమైతే క్రీమ్‌ ఆధారిత, జిడ్డు చర్మమైతే నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ ఎంచుకోవాలి. ఎండలోకి ఎక్కువగా వెళ్లొద్దు. వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్‌ కనీసం 30 ఎస్‌పీఎఫ్‌ ఉన్నది ప్రతి రెండు గంటలకోసారి రాయాలి. రెటినాల్‌, నియాసినమైడ్‌, డైమెథికాన్‌, గ్లైకాలిక్‌ ఆసిడ్‌, హాల్యురోనాయిక్‌ ఆసిడ్‌, పెప్టైడ్స్‌, మెగ్నీషియం ఉన్న సీరమ్‌లు, క్రీమ్‌లు వాడండి. ఇవి ముడతల్ని అదుపు చేస్తాయి. చెంచా ఆలివ్‌ నూనెకు కొన్ని చుక్కల గ్లిజరిన్‌ కలిపి ముఖానికి మర్దనా చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. అలోవెరా గుజ్జు, విటమిన్‌ ఇ కలిపి రాసి, 30 నిమిషాలుంచుకోవాలి. బాదం పొడికి తగినన్ని పాలు కలిపి రాసి ఆరేదాకా ఉంచుకోవాలి. వీటిలో ఏదోఒకదాన్ని రోజూ ప్రయత్నించొచ్చు. కడిగాక మాయిశ్చరైజర్‌ మాత్రం తప్పక రాయాలి.

అప్పటికే ముడతలు బాగా వచ్చేస్తే.. మైక్రోడర్మాబ్రేషన్‌, ఆర్‌ఎఫ్‌ లేజర్‌ థెరపీ, కెమికల్‌ పీల్స్‌, ఇంజెక్టబుల్‌ ఫిల్లర్స్‌ను సూచిస్తాం. నుదురు, కళ్ల దగ్గర అయితే ప్రతి 8 నెలలకోసారి బొటాక్స్‌ చేయించుకోవాలి. చర్మం సాగినట్లుగా ఉంటే ఫేస్‌లిఫ్టింగ్‌ సర్జికల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తాం. మానసిక, శారీరక ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ విటమిన్‌ సి ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 3-4 లీటర్ల నీటిని తాగాలి. నిద్రకీ ప్రాముఖ్యమివ్వాలి. విపరీతమైన ముఖకవళికలు ఇస్తోంటే తగ్గించుకోవాలి. మేకప్‌ అలవాటుంటే రాత్రుళ్లు తప్పక తొలగించాలి. ఇదీ ముడతలకు కారణమే. ఇక నలుపు మాత్రం వంశపారంపర్యమే. ఎండ, హార్మోన్లలో అసమతౌల్యం, కొన్ని రకాల చికిత్సలూ కారణమే. బ్లీచ్‌, రసాయనాలుండే ఉత్పత్తులకు దూరంగా ఉండండి. సహజమైన వాటికి ప్రాధాన్యమివ్వండి. గ్లైకాలిక్‌ ఆసిడ్‌, కోజిక్‌ ఆసిడ్‌, విటమిన్‌ సి ఉన్నవి ఎంచుకుంటే తగ్గుతుంది. ఐక్రీమ్‌లనూ వాడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని