నా వారసత్వాన్ని ఎలా నిరూపించాలి?

నా భర్త గవర్నమెంట్‌ బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగి. ఆరు నెలల కిందట మరణించారు. అంతకు ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. మావారి పేరున కొన్ని నామినీ లేని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు పొదుపు ఖాతాలున్నాయి. ఆ ఖాతాల్లోని డబ్బు నాకు

Published : 05 Apr 2022 01:30 IST

నా భర్త గవర్నమెంట్‌ బ్యాంకు రిటైర్డ్‌ ఉద్యోగి. ఆరు నెలల కిందట మరణించారు. అంతకు ముందు ఎలాంటి వీలునామా రాయలేదు. మావారి పేరున కొన్ని నామినీ లేని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు పొదుపు ఖాతాలున్నాయి. ఆ ఖాతాల్లోని డబ్బు నాకు చెందాలంటే ‘కుటుంబ ధ్రువీకరణ పత్రం’ కావాలంటున్నారు. తహసిల్దారు కార్యాలయంలో ఈ పత్రం కోసం దరఖాస్తు చేశాను. కానీ వారు కుటుంబ పింఛను కోసం తప్ప మరే ఇతర ప్రయోజనాల కోసం ఆ పత్రం ఇవ్వలేమంటున్నారు. మావారి పేరు మీదున్న ఫ్లాట్‌ను నా పేరు మీదకు మార్చుకోవాలంటే కోర్టు ద్వారా ‘వారసత్వ ధ్రువీకరణ పత్రం’ తీసుకురమ్మంటున్నారు ఎంఆర్‌ఓ కార్యాలయం వారు. నా భర్త పేరు మీదున్న సొమ్ము, ఫ్లాట్‌ నాకు చెందాలంటే కోర్టులో నేనేం కేసు వేయాలి? 

 - ఒక సోదరి, హైదరాబాద్‌

మీరు వారసత్వ ధ్రువీకరణ పత్రం కోర్టు ద్వారానే పొందాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు అతని స్థిర, చరాస్తులు తన వారసులకు చెందుతాయి. మీవారి వారసులు ఎవరో కోర్టు ద్వారా నిర్ణయమైతే దానికి చట్ట నిబద్ధత (లీగల్‌ వ్యాలిడిటీ) ఉంటుంది. హిందూ వారసత్వ చట్టం, సెక్షన్‌-8 ప్రకారం ప్రథమ వారసులుగా తల్లి, భార్య, పిల్లలకు గుర్తింపు ఉంటుంది. వీరిని కోర్టు ద్వారా ధ్రువీకరించాలంటే మీ భర్త డెత్‌ సర్టిఫికెట్‌ జత చేసి, వారసులు ఎవరెవరున్నారో వారందరిని వాదులుగా చేర్చి, ఎవరైతే మిమ్మల్ని లీగల్‌ హేర్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారో వారందరినీ ప్రతివాదులుగా చేర్చి... అంటే ఎవరి దగ్గర మీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ ఉన్నాయో ఆయా బ్యాంకుల వారిని ప్రతివాదులుగా, స్థిరాస్తులు ఉంటే ఎక్కడ ఆస్తులు ఉన్నాయో ఆ సంబంధిత రెవెన్యూ అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చి దావా వేయండి. మీ చిరునామా, ఆధార్‌, ఆస్తికి సంబంధించిన కాగితాలూ జత చేయండి. ఆస్తి విలువ ఎంత ఉందో దానికి తగిన కోర్టు ఫీజు కూడా కట్టాలి. న్యాయస్థానం అన్ని కాగితాలను పరిశీలించి... మిమ్మల్ని, మీ పిల్లలను వారసులుగా ధ్రువీకరిస్తుంది. సాధారణంగా కోర్టు నోటీసు ప్రొసీజర్‌ ఉంటుంది. కాబట్టి ఆరు నెలల నుంచి ఏడాది లోపల మీరు మీ డిక్రీ పొందొచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా మొదలుపెట్టండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని