మండే ఎండల్లో ఏం తినిపించాలి?

నాకో పాప, బాబు. ఒంటిపూట బడులు మొదలైనప్పటి నుంచి ఆహారం విషయంలో ఇద్దరితోనూ ఇబ్బందే. ఉదయం టైమ్‌ లేదని... మధ్యాహ్నం ఆకలి లేదని సరిగా తినడం లేదు. ఈ వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పోషకాలు ఇవ్వాలి? 

Published : 07 Apr 2022 01:24 IST

నాకో పాప, బాబు. ఒంటిపూట బడులు మొదలైనప్పటి నుంచి ఆహారం విషయంలో ఇద్దరితోనూ ఇబ్బందే. ఉదయం టైమ్‌ లేదని... మధ్యాహ్నం ఆకలి లేదని సరిగా తినడం లేదు. ఈ వేసవిలో చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పోషకాలు ఇవ్వాలి? 

- స్వాతి, హైదరాబాద్‌

ల్పాహారం తీసుకోకపోవడం వల్ల చదువుతో పాటు దేని మీదా దృష్టి పెట్టలేరు. కాబట్టి ఉదయం త్వరగా, సులువుగా తినేలా, పోషకాహారాన్ని ఇవ్వాలి. చల్లని ద్రవాలైతే గటగటా తాగేస్తారు. పాలు (200ఎం.ఎల్‌.), బెల్లం (10 గ్రా., రాగిపిండి (30 గ్రా.,) తో చేసిన జావ రుచిగా ఉండటమే కాకుండా పోషకాలను అందిస్తుంది. ఇందులో పల్లీలు, ఇతర డ్రైఫ్రూట్‌్్సను పొడి చేసి కలిపితే గ్లాసంతా ఖాళీ చేసేస్తారు. పెరుగన్నం, ఓట్‌్్స, జావ, మజ్జిగ కలిపి ఇవ్వొచ్చు. ఏదైనా పండుతో మిల్క్‌షేక్‌ (పాలు, ఓట్స్‌, ఆపిల్‌/తర్బూజ ) లేదా వాటర్‌ మెలన్‌ జ్యూస్‌, ఉడికించిన గుడ్డు పెట్టొచ్చు. ఉదయం... ఇడ్లీ, దోశ లాంటివి పెట్టేసి, స్కూల్‌లో విరామ సమయం (ఇంటర్వెల్‌)లోకి ఫ్లేవర్డ్‌ యోగర్ట్‌, సోయా మిల్క్‌; స్వీట్‌ లస్సీ ఇవ్వొచ్చు.  

మధ్యాహ్న భోజనం... దాహమేసి నీళ్లు ఎక్కువగా తాగేస్తారు. తాగాలి కూడా. అయితే ఒకేసారి ఎక్కువ కాకుండా రోజంతా అప్పుడప్పుడూ తాగేలా చూడాలి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీలాంటివీ తాగించాలి. మధ్యాహ్నం ఇంట్లో ఉన్నారు కదాని ఎక్కువ పెట్టేయొద్దు. బడికి బాక్స్‌లో పెట్టినంత సరిపోతుంది. ఎక్కువ తినలేని వాళ్లకు ఆలూ పరాఠాలు, చపాతీలు, శాండ్‌విచ్‌, మిస్సీ రోటీ, చపాతీతో ఆమ్లెట్‌ పెట్టొచ్చు.

డీ హైడ్రేషన్‌కి గురికాకుండా... చిన్నారులు డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కొబ్బరి నీళ్లు, నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చ, తర్బూజ పండ్లను ఇవ్వాలి. బత్తాయి, కమలా, దానిమ్మ, ద్రాక్ష రసాలివ్వాలి.

సాయంకాలం... స్వీట్‌కార్న్‌, చనాచాట్‌, డోక్లా, బేల్‌పురీ ఇవ్వొచ్చు. లంచ్‌లో సరిగా తినలేకపోతే ఈ సమయంలో ఇడ్లీ, పెసరట్టు, రాగి జావ లాంటివి పెట్టొచ్చు. పండ్ల రసం, లస్సీల్లో సబ్జాగింజలు నానబెట్టి ఇస్తే చలవతోపాటు తగినంత పీచూ లభిస్తుంది. ఈ కాలంలో విరివిగా దొరికే మామిడి, ముంజలు, అంజీర్‌ వంటివి ఇవ్వచ్చు. పాలతో చేసిన కుల్ఫీ, మ్యాంగో ఐస్‌క్రీమ్‌, మస్క్‌ మెలన్‌ కుల్ఫీలతోపాటు... పండ్ల రసాలతో చేసిన ఐస్‌క్యూబ్‌, లాలీపాప్స్‌, పాలు, పండ్లతో చేసిన మిల్క్‌షేక్స్‌ని ఐస్‌ క్యూబ్స్‌, ఐస్‌ క్యాండీస్‌లా పెట్టొచ్చు. జెల్లీస్‌, ప్రూట్‌ జెల్లీ, జెల్లీ విత్‌ ఫ్రూట్స్‌, చైనా గ్రాస్‌తో చేసిన జెల్లీ... ఇలా రకరకాలుగా చేసి పెట్టొచ్చు.

రాత్రి... ఉదయం నుంచి తీసుకోని ఆకుకూరలు, కాయగూరలు, ప్రొటీన్లు రాత్రి భోజనంలో ఉండేలా చూసుకోవాలి. చపాతీతో పనీర్‌ కూర, దాల్‌ రైస్‌ లాంటివి పెట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని