జిడ్డుకు తోడు నలుపు!
వయసు 17. నాది జిడ్డు చర్మం. స్నానం చేసినా, ముఖం కడిగినా కొద్దిసేపే! క్రీములు వాడినా ప్రయోజనం లేకపోగా నల్లబడుతున్నా. మరేంటి పరిష్కారం?
వయసు 17. నాది జిడ్డు చర్మం. స్నానం చేసినా, ముఖం కడిగినా కొద్దిసేపే! క్రీములు వాడినా ప్రయోజనం లేకపోగా నల్లబడుతున్నా. మరేంటి పరిష్కారం?
- ఓ సోదరి, నిజామాబాద్
చర్మానికి నూనెలు అవసరం. కానీ అది మరీ ఎక్కువగా విడుదలైతేనే ఈ సమస్య. కొందరిలో మొటిమలొస్తే.. మరికొందరికి ముఖం జిడ్డుగా, నల్లగా మారుతుంటుంది. మందంగా ఉన్నట్లూ అనిపిస్తుంటుంది. ఒత్తిడి, హార్మోనుల్లో మార్పులూ కొన్నిసార్లు వంశపారంపర్యమూ కారణమవొచ్చు. ముఖాన్ని రోజులో కనీసం రెండుసార్లైనా గోరువెచ్చని నీటితో కడుగుతుండాలి. ఆయిల్ ఫ్రీ ఫేస్‌వాష్‌ను ఎంచుకోవాలి. సువాసనలు, తేమను అందించే, రసాయనాలు ఎక్కువగా ఉన్నవి వాడొద్దు. ముఖం కడిగాక టోనర్ తప్పక వాడాలి. మ్యాటే మాయిశ్చరైజర్, జెల్ ఆధారిత సన్‌స్క్రీన్‌లు ఎంచుకోవాలి. డే, నైట్ క్రీమ్‌లు ఎంచుకుంటే మంచిది. వాటిల్లో.. నియాసినమైడ్, విటమిన్ సి, టాపికల్ రెటినాయిడ్స్, సాల్సిలిక్ ఆసిడ్, మాండాలిక్ ఆసిడ్ ఉండేలా చూసుకోండి. క్రీములేవైనా ముందు శరీరంలో ఎక్కడైనా ప్రయత్నించి పడుతోంది అనుకున్నాకే ముఖానికి రాయాలి. మరీ ఎక్కువగా ముఖాన్ని కడగొద్దు. మెడికేటెడ్ బ్లాటింగ్ పేపర్స్‌ను దగ్గరుంచుకొని వాటితో ముఖాన్ని అద్దితే చాలు. నూనెల్ని పీల్చేస్తాయి. ఎండల్లో ఎక్కువగా తిరగడం, అతి మేకప్‌లకు దూరంగా ఉండండి. మేకప్ తప్పనిసరైతే వాటర్/ మినరల్ బేస్‌డ్‌వి ఎంచుకోవాలి. వారానికి కనీసం రెండుసార్లు స్క్రబింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి.
నూనె, నిల్వ పదార్థాలను బాగా తగ్గించాలి. కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. జిడ్డు చర్మం ఉందని వ్యాయామం వదిలేస్తారు. కానీ.. తప్పక చేయాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి.
* పాలపొడి, తేనె, నిమ్మరసం టేబుల్ స్పూను చొప్పున తీసుకొని, కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
* టమాట రసం, పెరుగు స్పూను చొప్పున తీసుకుని దానికి రెండు స్పూన్ల ఓట్‌మీల్ పౌడర్ కలపాలి. ముఖానికి పట్టించి, ఆరాక కడిగేస్తే సరి. పసుపు, నిమ్మరసం కలిపీ రాసుకోవచ్చు. వీటిని వారానికి రెండుసార్లు ప్రయత్నించండి. జిడ్డు తద్వారా నల్లబడటం అదుపులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.