తాతయ్య ఆస్తి... మాకొస్తుందా?

అమ్మానాన్నలది ప్రేమ వివాహం. ఇది నాన్నమ్మవాళ్లకు ఇష్టం లేదు. నాన్న ఏడేళ్ల కిందట మరణించారు. మా తాతయ్యకి చాలా భూములున్నాయి. ఆయనకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. నాన్న వారసత్వపు ఆస్తి ఏమీ మాకు రాలేదు.

Updated : 03 May 2022 12:36 IST

అమ్మానాన్నలది ప్రేమ వివాహం. ఇది నాన్నమ్మవాళ్లకు ఇష్టం లేదు. నాన్న ఏడేళ్ల కిందట మరణించారు. మా తాతయ్యకి చాలా భూములున్నాయి. ఆయనకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. నాన్న వారసత్వపు ఆస్తి ఏమీ మాకు రాలేదు. ఈ మధ్యే భూమి అమ్మాలని చెప్పి మా సంతకాలు తీసుకున్నారు. నేనొక్కదాన్నే చేయలేదు. ఆ సంతకాల ఆధారంగా మా వాటా మొత్తం వాళ్లకు రాసిచ్చిట్లు పత్రాలు సృష్టించారు. ఆ కాగితాలు పది రూపాయల బాండ్‌ పేపర్‌ మీద రాసినవి. రిజిస్ట్రేషన్‌ చేయించలేదు. మా తాతయ్య కొడుకుల్లో ముగ్గురు చనిపోయారు. భూమికి సంబంధించిన పత్రాలు ఇమ్మంటే పెద్దనాన్న లేవంటున్నాడు. మా తాతయ్య ఆస్తిలో నాన్న వాటా మాకొస్తుందా?

- సంతోషి

మీ తాతయ్య ఆస్తి ఆయన వారసులకు తన తదనంతరం పిత్రార్జితపు ఆస్తి అవుతుంది. ఆయన వీలునామా రాయకుండా చనిపోతే అందరికీ సమానంగా వస్తుంది. మీ తాతయ్య కొడుకులు ఎవరైనా చనిపోతే, వారి వాటా వాళ్ల పిల్లలకు సమానంగా పంచాలి. అలా మీ నాన్న వాటా మీ అందరికీ వస్తుంది. మీరంతా కలిసి రెలింక్వెష్‌మెంట్‌ (ఆస్తి వదులుకుంటున్నట్లు పత్రం) డీడ్‌ రాసి రిజిస్టర్‌ చేస్తేనే చెల్లుతుంది. రూ.10 స్టాంపు పేపర్‌ మీద సంతకాలు చేసినంత మాత్రాన అది చెల్లదు. మీ తాతగారికి ఎంత ఆస్తి ఉంది. ఎంతమంది వారసులున్నారు అంటే.. కొడుకులు, కూతుళ్లు, చనిపోయిన కొడుకుల పిల్లలు (అమ్మాయిలు, అబ్బాయిలు)... ఇలా అందరి పేర్లు, చిరునామాలు సేకరించాలి. ఎవరు భూమిని అనుభవిస్తున్నారో, ఎవరు మీతో కలిసి వస్తున్నారో ముందు తెలుసుకోండి. మీ తాతయ్య భూమికి సంబంధించిన పత్రాలు.. అడంగళ్లు/పహాణీ (రెవెన్యూ రికార్డ్సు)లను రెవెన్యూ శాఖ ద్వారా సంపాదించండి. ఎక్కడ భూములున్నాయో అక్కడ రెవెన్యూ రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుంది. మీ తాతయ్య వీలునామా రాసి ఉంటే అది రిజిస్టర్‌ అవకపోయినా చెల్లుతుంది. దాని మీద సాక్షి సంతకాలు ఎవరు పెట్టారో కనుక్కుంటే మీ నాన్న పేరు మీద ఎంత భూమి రాశారో తెలుస్తుంది. తాతయ్య మీ నాన్నకు రాసిన భాగం ఆయన స్వార్జితం. అది మీ తండ్రి చనిపోయిన తర్వాత మీకే చెందాలి. దాని మీద ఎవరికీ హక్కు లేదు. మీ నాన్న వీలునామా రాయలేదు కాబట్టి పిల్లలందరికీ ఆస్తి సమానంగా వస్తుంది. ముందుగా మీరు కాగితాలు సంపాదించి మీ తాతయ్య వీలునామా ప్రకారం మీకు రావాల్సిన వాటా కోసం డిక్లరేషన్‌ దావా వేయండి. అందులో మీతోపాటు వారసులందరినీ చేర్చండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్