ఏడాది పాప... బరువు ఏడున్నర కిలోలే!
పుట్టినపుడు మా పాప బరువు 2.5 కిలోలు. పన్నెండో నెలకు 7.5 కిలోలుంది. ఉండాల్సినంత బరువు లేదంటున్నారు చూసినవాళ్లు. తల్లిపాలతోపాటు సెరిల్యాక్ తినిపించేవాళ్లం. ఇప్పుడు ఉగ్గు తినిపిస్తున్నాం. ఈ మధ్యనే కొద్దికొద్దిగా అన్నం తింటోంది.
పుట్టినపుడు మా పాప బరువు 2.5 కిలోలు. పన్నెండో నెలకు 7.5 కిలోలుంది. ఉండాల్సినంత బరువు లేదంటున్నారు చూసినవాళ్లు. తల్లిపాలతోపాటు సెరిల్యాక్ తినిపించేవాళ్లం. ఇప్పుడు ఉగ్గు తినిపిస్తున్నాం. ఈ మధ్యనే కొద్దికొద్దిగా అన్నం తింటోంది. ఆరోగ్య సమస్యలేవీ లేవు. కానీ ఎప్పటికీ ఇలానే బరువు తక్కువగా ఉంటుందా అన్నది మా ఆందోళన. ఏం చేస్తే బరువు పెరుగుతుంది.
- దేవి, వైజాగ్
పాపకు ఏ అనారోగ్యాలూ లేవు కాబట్టి కంగారు పడకండి. పుట్టినప్పటి బరువుననుసరించే పిల్లల ఎదుగుదల ఉంటుంది. నెల నెలా బరువు కొలుస్తూ ఉండాలి. క్రమంగా పెరుగుతూనే ఉంటే ఎదుగుదల సాధారణంగా ఉన్నట్లే. ఏడాది వచ్చేసరికి సాధారణంగా 9-10 కిలోలు ఉంటారు. కానీ అందరూ కచ్చితంగా అలానే ఉండాలని లేదు. మీ పాపది సాధారణంకంటే కాస్త తక్కువ బరువు. ఉండాల్సిన దాని కంటే 25-50 శాతం తక్కువగా ఉంటే ఆలోచించాలి. శరీరం ఒక వ్యవస్థ. సహజంగానే అది వృద్ధి చెందుతుంది. మీరు చేయాల్సిందల్లా ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టడమే. 7-12 నెలలు పిల్లల్లో ఆహారంపైన ఇష్టం కలిగించడానికి అద్భుతమైన సమయం. రెండేళ్లు దాటితే వాళ్లకి ఇష్టాయిష్టాలు ఏర్పడతాయి. ఈలోపే రకరకాల రుచులూ, రంగులూ, వాసనలున్న ఆహారం అలవాటు చేయాలి. ఇంట్లో వండే అన్ని వంటకాల్నీ రుచి చూపించవచ్చు. అదే సమయంలో నాణ్యత చూసుకోవాలి. బొప్పాయి, మామిడి, క్యారెట్... గుజ్జులను రుచిచూపండి. తింటుంటే పరిమితంగా పెట్టొచ్చు. సొర, గుమ్మడి సూపులు తాగించవచ్చు. ఆకుకూరల్ని ఉడికించి, రుబ్బి అప్పుడప్పుడూ 2-3 స్పూన్లు తాగిస్తూ ఉండాలి. ఉడకబెట్టిన గుడ్డునీ ఇవ్వొచ్చు. దంతాలు వస్తే ఇడ్లీ, దోశ, ఉప్మా తినిపించవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలమీద దృష్టి పెట్టాలి. పండ్లన్నీ ఇవ్వొచ్చు. కారం తగ్గించి బీర, బీన్స్ లాంటి కూరల్నీ పెట్టొచ్చు. పిల్లలకు తినిపించడం తల్లిదండ్రుల బాధ్యతలా ఉండకూడదు, వాళ్లే స్వతహాగా తినేలా ఉండాలి. టీవీ, మొబైల్ చూపిస్తూ తినిపిస్తే వాళ్ల దృష్టి కదిలే బొమ్మలమీదే తప్ప తిండిమీదకి పోదు. స్వయంగా తినేలా అలవాటు చేయాలి. ఆహార వేళల్ని పాటించాలి. మాంసాహారులైతే కీమా, లివర్, ఫిష్, చికెన్ మెత్తగా ఉడికించి ఇవ్వొచ్చు. వీటిలో మంచి ప్రొటీన్ ఉంటుంది. ఉడకబెట్టిన శనగలు, గుగ్గిళ్లు ఇవ్వొచ్చు. ఎన్ని భిన్నమైన రుచుల్ని అలవాటు చేస్తే అన్ని రకాల పోషకాలు అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.