వీలునామా ఉన్నా...వాటా అడుగుతున్నారు..!
మా అమ్మమ్మగారికి నలుగురు కొడుకులు, అయిదో సంతానం మా అమ్మ. తాతగారి మరణానంతరం పొలాన్ని మావయ్యలు పంచుకున్నారు. అమ్మకు వాటా ఇవ్వలేదు. మా అమ్మమ్మగారున్న ఇంట్లో అమ్మకు పెళ్లి జరిగింది. మా అమ్మమ్మకి పెన్షన్ లేదు.
మా అమ్మమ్మగారికి నలుగురు కొడుకులు, అయిదో సంతానం మా అమ్మ. తాతగారి మరణానంతరం పొలాన్ని మావయ్యలు పంచుకున్నారు. అమ్మకు వాటా ఇవ్వలేదు. మా అమ్మమ్మగారున్న ఇంట్లో అమ్మకు పెళ్లి జరిగింది. మా అమ్మమ్మకి పెన్షన్ లేదు. అమ్మ ఉద్యోగం చేస్తుండటంవల్ల అమ్మమ్మ పోషణ, ఆ ఇంటి మరమ్మతులు, పన్నులు కట్టడం చేసేవారు. అమ్మకీ, మనవరాళ్లైన మా ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఆ ఇంటి స్థలం (ఇల్లు శిథిలమైంది) చెందేట్టు అమ్మమ్మ 1982లో విల్లురాసి రిజిస్ట్రేషన్ చేశారు. అది మావయ్యలకీ తెలుసు. అమ్మమ్మ ’95లో చనిపోయే వరకూ అమ్మ దగ్గరే ఉంది. ముగ్గురు మావయ్యలూ మరణించాక.. మా అత్తయ్యలు, వారి సంతానం ఆ స్థలంపైన హక్కు కోరుతూ పార్టిషన్ సూట్ వేశారు. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. మేం హియరింగ్‌కు వెళ్తున్నా వాళ్లు హాజరు కాకుండా వాయిదాలు వేస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం అవడం లేదు. 40 ఏళ్లుగా పన్నులు కడుతున్నాం. అమ్మ కూడా 2016లో చనిపోయారు. ఇప్పుడేం చేయాలి.
- ఒక సోదరి
కోర్టులో కేసు ముందుకు వెళ్లాలంటే రెండు వైపుల వాళ్లూ హాజరవ్వాలి. అలా కాకపోవడంవల్ల కొన్ని కేసులు దశాబ్దాలు దాటిపోతున్నాయి. అందుకే ఇలాంటి కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమంటాం. మీ సమస్యకి వస్తే, వీలునామా రిజిస్టర్ అయ్యాక భాగస్వామ్యం కోసం కేసు వేసినా మీ అమ్మమ్మ గారు రాసిన వీలునామా నిరూపితమైతే అది నిలబడదు. ఇల్లు మీ అమ్మమ్మగారి పేరు మీద ఉంటే అది ఆవిడ స్వార్జితం. అప్పుడది తన ఇష్టం వచ్చినవారికి ఇవ్వొచ్చు. కాబట్టి మీ అమ్మగారి పేరుమీద రాసిన విల్ చెల్లుతుంది. మీరు విల్ గురించి కోర్టులో ప్రస్తావించారా? దాని ప్రకారం వాదులకు ఎటువంటి హక్కూ లేదు. మీ అమ్మగారు ఉన్నన్నాళ్లు వాళ్ల తల్లిగారి పోషణ ఖర్చుల్ని భరించారంటున్నారు. దానికి సంబంధించిన కాగితాల్నీ, మీరు కడుతున్న పన్నుల కాగితాల్నీ కోర్టుకు సమర్పించండి. మీ అమ్మమ్మగారి ఇష్టపూర్వకంగా విల్ రాశారనే విషయం కోర్టుకు తెలపండి. మీ అమ్మగారి తదనంతరం ఆ ఇల్లు మీకే చెందుతుంది. కోర్టులో కేసు వేసిన వాళ్లు రాకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్లు రావడంలేదన్న విషయాన్ని కోర్టుకు తెలపండి. సాధారణంగా వారి తరఫున లాయర్ వచ్చి వాయిదాలు తీసుకుంటారు. ఆలస్యమైనా మీరే గెలుస్తారు. అధైర్య పడకండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.