ఆ పౌడర్లు బరువు తగ్గిస్తాయా?

బరువు తగ్గిస్తాయంటూ ఈమధ్య మార్కెట్‌లో చాలా రకాల పౌడర్లు అమ్ముతున్నారు. వాటితో నిజంగా ప్రయోజనం ఉంటుందా?

Published : 23 Jun 2022 02:11 IST

బరువు తగ్గిస్తాయంటూ ఈమధ్య మార్కెట్‌లో చాలా రకాల పౌడర్లు అమ్ముతున్నారు. వాటితో నిజంగా ప్రయోజనం ఉంటుందా?

- ఒక సోదరి, కావలి

తినే ఆహారం, రుచులు, పరిమాణం, నాణ్యత, శారీరక శ్రమ వీటిని అనుసరించే ఒకరి శరీర బరువు ఆధారపడి ఉంటుంది. ఈ అలవాట్లని మానేయాలన్నా, మార్చుకోవాలన్నా ఎవరికైనా చాలా కష్టం. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఆహారలేమి కంటే కూడా ఊబకాయంతో బాధపడుతున్నవాళ్లే ఎక్కువయ్యారు. మన దేశంలోనూ వీళ్లు పెరుగుతున్నారు. గ్రామీణ పురుషుల్లో కంటే మహిళల్లో ఊబకాయ సమస్య కనిపిస్తోంది. అధిక బరువుతో మధుమేహం, గుండె జబ్బులు, సంతానలేమి, కాళ్ల నొప్పుల్లాంటి సమస్యలూ వస్తాయి. బరువు తక్కువగా, ఎక్కువగా ఉన్నా సమాజం భిన్నంగా చూస్తుంది. దీంతో బరువు అనేది వేల కోట్ల రూపాయల వ్యాపారమైంది. విదేశాల్లో ఎప్పుడో మొదలై.. ఇప్పుడు మనకూ పాకింది. అందులో భాగంగానే ఈ పౌడర్లు వస్తున్నాయి.

మామూలుగా పోషకాహార నిపుణుల సూచనలు పాటించడానికి కష్టంగా భావిస్తారు. ఎందుకంటే తీసుకునే ప్రతి పదార్థం విషయంలోనూ ఒక పద్ధతి, మోతాదు ఉండాలని చెబుతాం. అందులో ఏం ఉందో స్పష్టంగా చెప్పకుండానే ఆహారానికి బదులుగా ఈ పౌడర్‌ని నీళ్లలో కలుపుకొని తాగితే చాలని ఆ కంపెనీలు ప్రచారం చేస్తాయి. సాధారణంగా ఆ పౌడర్‌ ప్రొటీన్‌, విటమిన్‌ మొదలైన వాటి మిశ్రమమే అవుతుంది. మంచి ఆహారాన్ని ఇంట్లో తయారు చేయడానికి సమయం పడుతుంది. పౌడర్‌ని నీటిలో కలిపి తాగితే ఆ శ్రమ తప్పుతుందని అటువైపు వెళ్తున్నారు. నిజానికి పోషకాహార తయారీకి అయ్యే ఖర్చుకంటే వీటి ధర చాలా ఎక్కువ. కానీ కొంటున్నారంటే.. దీన్నో దివ్యౌషధంగా ప్రచారం చేయడమే. డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఆయా వ్యక్తుల శరీరతత్వాన్ని, వాళ్లు చేసే పని, వయసు, ఇతర ఆరోగ్య సమస్యల్నిబట్టి మందుల్నీ, ఆహారాన్నీ, వ్యాయామాలనీ సూచిస్తారు. అలా కాకుండా ఈ పౌడర్లని పెద్దగా చదువుకోని, వాటిపైన అవగాహన లేనివాళ్లు అందరిచేతా కొనిపిస్తారు. బరువు తగ్గించడానికి ఈ పౌడర్లు సహజమైన, ఆరోగ్యకరమైన పద్ధతైతే కాదు. తాత్కాలికంగా ఫలితం కనిపించినా దీర్ఘకాలంలో ఇతర సమస్యలకు దారి తీయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని