ఒంటి నిండా వెంట్రుకలే.!

నాకు ఇరవై ఏళ్లు. చేతులు, కాళ్లే కాదు ముఖం సహా ఒంటి నిండా వెంట్రుకలే. నలుగురిలో చిన్నతనంగా అనిపిస్తోంది.

Updated : 26 Jun 2022 02:58 IST

నాకు ఇరవై ఏళ్లు. చేతులు, కాళ్లే కాదు ముఖం సహా ఒంటి నిండా వెంట్రుకలే. నలుగురిలో చిన్నతనంగా అనిపిస్తోంది. నాకు పీరియడ్‌ సమస్యలూ లేవు. అయినా ఎందుకిలా? పోగొట్టుకునే మార్గమేదైనా ఉందా?

- ఓ సోదరి

హార్మోనుపరంగా సమస్య లేదంటే వంశపారంపర్యం అయ్యుండొచ్చు. దీనికి వ్యాక్సింగ్‌, త్రెడింగ్‌, హెయిర్‌ రిమూవింగ్‌ క్రీమ్‌లు వాడటం, లేజర్‌, ఎలక్ట్రాలసిస్‌ ట్రీట్‌మెంట్లు పరిష్కారాలు. వ్యాక్సింగ్‌, త్రెడింగ్‌, హెయిర్‌ రిమూవల్‌ క్రీమ్‌లు తాత్కాలిక ఉపశమనమిస్తాయి. అయితే చర్మం నల్లబడటం, దద్దుర్లు వంటి వాటికీ ఆస్కారముంటుంది. శాశ్వత పరిష్కారానికి కేవలం ముఖం మీది వాటినే తొలగించడానికైతే ఎలక్ట్రాలసిస్‌ను, శరీరం మొత్తానికైతే అలెగ్జాండ్రేట్‌, రూబీ, డయోడ్‌, ఇండియాక్‌, ఎల్‌పీఎండియాక్‌ వంటి లేజర్‌ చికిత్సలను సూచిస్తాం. ఇవి ఖర్చుతో కూడుకున్నవి కానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు.

సహజంగా ప్రయత్నించాలనుకుంటే.. పసుపు, సెనగపిండి పావుకప్పు చొప్పున తీసుకొని తగినంత నువ్వుల నూనె కలిపి సమస్య ఉన్నచోట రాయాలి. తర్వాత కొద్దికొద్దిగా తడిచేస్తూ రుద్దుతూ తొలగిస్తే సరి. పచ్చి బొప్పాయి పేస్ట్‌కు పసుపు కలిపి రాసి, ఆరాక కడిగేయండి. బంగాళాదుంప పేస్ట్‌కు కందిపప్పు లేదా పెసరపప్పు రాత్రంతా నానబెట్టి చేసిన పేస్ట్‌, తేనె, నిమ్మరసం కలిపి రాసి ఆరాక తడిలేకుండానే రుద్దేయాలి. ఆపై నీళ్లతో కడగాలి. మొక్క జొన్నపొడి, ఎగ్‌వైట్‌, పంచదార కలిపి శరీరానికి పట్టించి, ఆరాక పీల్‌ఆఫ్‌ మాస్క్‌లా తీసేయండి. పంచదార, నిమ్మరసం వేడిచేసి కొంచెం గట్టిపడ్డాక చర్మంపై రాసి, వ్యాక్స్‌ స్ట్రిప్‌తో లాగేయండి. వీటిలో ఏదో ఒకదాన్ని వారానికి ఒకటి, రెండుసార్లు చేస్తే వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకున్నాకే ప్రయత్నించండి. అయితే ఇవి వెంటనే ప్రభావం చూపవు. కొద్ది నెలలపాటు క్రమం తప్పక చేస్తేనే ప్రయోజనం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని