నాన్న ఆస్తిలో బంధువుకు వాటా కావాలట!

నాన్నమ్మ నుంచి నాన్నకి రిజిస్టర్డ్‌ వీలునామా ద్వారా వచ్చిన ఇల్లు, ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నాయి. కానీ వాటి విస్తీర్ణం, సర్వే నంబరు లాంటి వివరాలు అందులో లేవు. నాన్నకి ఏకైక కుమార్తెని. రిజిస్టర్డ్‌ వీలునామా ద్వారా ఆ ఇంటినీ, దాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని సరిహద్దులతో నాన్న నాకు రాశారు. ఖాళీ స్థలాన్ని సర్వే చేయగా గ్రామ కంఠం అని తేలింది. అది ఇంటితో కలిసి 33 సెంట్లు. ఇంటికి పన్ను కడుతున్నాం.

Published : 28 Jun 2022 00:19 IST

నాన్నమ్మ నుంచి నాన్నకి రిజిస్టర్డ్‌ వీలునామా ద్వారా వచ్చిన ఇల్లు, ఇంటి ముందు ఖాళీ స్థలం ఉన్నాయి. కానీ వాటి విస్తీర్ణం, సర్వే నంబరు లాంటి వివరాలు అందులో లేవు. నాన్నకి ఏకైక కుమార్తెని. రిజిస్టర్డ్‌ వీలునామా ద్వారా ఆ ఇంటినీ, దాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని సరిహద్దులతో నాన్న నాకు రాశారు. ఖాళీ స్థలాన్ని సర్వే చేయగా గ్రామ కంఠం అని తేలింది. అది ఇంటితో కలిసి 33 సెంట్లు. ఇంటికి పన్ను కడుతున్నాం. వీలునామాలో 10 సెంట్ల మేరకు ఇల్లు, ఖాళీ స్థలం అని మాత్రమే రాసుంది. మిగిలిన ఖాళీ స్థలాన్ని నా పిల్లలకి గిఫ్ట్‌ డీడ్‌గా ఇద్దామనుకుంటే మా బంధువు అందులో ‘నేను కొబ్బరి చెట్లు నాటాను, నాకూ హక్కుంద’ంటున్నారు. ఆయనకి ఇది వరకు నోటిమాట ద్వారా వేరేచోట గ్రామకంఠంలోనే కొంత ఇంటి స్థలం ఇస్తామన్నాం. ఈ వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలి?

గ్రామ కంఠం భూమికి సాధారణంగా సర్వే నంబర్లు ఉండవు. అది మీకు వంశపారంపర్యంగా వచ్చి ఇంటితో కలిపి ఉంది కాబట్టి మీ ఇంటి నంబరు మీదనే రిజిస్ట్రేషన్‌ చేయాలి. ముందుగా మీరు చెబుతున్న 23 సెంట్ల గ్రామ కంఠం భూమి మీ పేరు మీద రిజిస్టర్‌ చేయించుకోండి. గ్రామ కంఠం అయినా మీ ఇంటికి సంబంధించింది కాబట్టి మీదే అవుతుంది. అతను కొబ్బరి చెట్లు ఎలా నాటారు? అప్పుడు మీరు ఎందుకు అడ్డు చెప్పలేదు. అతను అనుభవిస్తున్నట్లుగా దాఖలాలు ఉన్నాయా? గ్రామ కంఠం భూమిని అనుభవిస్తున్నవారి పేరు  మీద బదలాయింపు చేసుకోవడానికి 2016లో ఒక జీఓ ద్వారా వెసులుబాటు కల్పించారు. గ్రామపంచాయతీలో ముందుగా ఈ స్థలం మీపేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చుకోడానికి దరఖాస్తు చేయండి. ఒకసారి మీ పేరు మీద బదలాయింపు అయ్యాక అతను మీకు అడ్డు చెప్పలేడు. ఒకవేళ అతను పంచాయితీలో దీనికి అభ్యంతరం పెడితే ఎమ్మార్వో/ తహసీల్దార్‌ ఆధ్వర్యంలో విచారణ చేసి దానిమీద ఎవరికి హక్కు ఉందో నిరూపించాల్సి ఉంటుంది. సాధారణంగా దీర్ఘకాలంగా ఎవరు ఆ స్థలంలో ఉన్నారో వారిదే అని చెబుతారు. కేవలం 5 సెంట్ల భూమి విషయంలో మీకు తేడా వస్తుంది కాబట్టి అవసరమైతే ఆ భూమిని పక్కన పెట్టి మిగిలిన భూమిని మీ పేరుమీద బదలాయించుకోండి. అలా చేయడం కుదరకపోతే ఆర్డీఓ లేదా కలెక్టర్‌కు సమస్యను వివరిస్తూ దరఖాస్తు పెట్టుకోండి. ఇలాంటి సమస్యలు నెలలో ఒకరోజు పరిష్కరిస్తున్నారు. అక్కడా కుదరకపోతే సివిల్‌ కోర్టులో దావా వేయాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని