నాజూకు నడుము కోసం...
పొట్టలోని అవయవాలకు ఈ శీర్షాసనం బాగా ఉపయోగపడుతుంది. నడుం సన్నగా, నాజూగ్గా అవ్వాలన్నా, పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలన్నా, ప్లీహం (స్ల్పీన్), క్లోమ గ్రంథి (పాంక్రియాజ్), కాలేయం, మూత్రపిండాలు, పేగులు, అధివృక్క గ్రంథులు (అడ్రినల్ గ్లాండ్స్)- ఇలా అవయవాలన్నీ ఉత్తేజితం అయ్యేందుకు ఈ ఆసనం వేయండి..
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయిందని బాధపడుతున్నారా? సన్నగా, నాజూగ్గా కనిపించాలని ఆశపడుతున్నారా? అందుకోసం జిమ్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు. ‘పరివృత్త జాను శీర్షాసనం’ ప్రయత్నించండి. మీ ఆశ ఇట్టే నెరవేరుతుంది.
పొట్టలోని అవయవాలకు ఈ శీర్షాసనం బాగా ఉపయోగపడుతుంది. నడుం సన్నగా, నాజూగ్గా అవ్వాలన్నా, పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలన్నా, ప్లీహం (స్ల్పీన్), క్లోమ గ్రంథి (పాంక్రియాజ్), కాలేయం, మూత్రపిండాలు, పేగులు, అధివృక్క గ్రంథులు (అడ్రినల్ గ్లాండ్స్)- ఇలా అవయవాలన్నీ ఉత్తేజితం అయ్యేందుకు ఈ ఆసనం వేయండి. ఇది మనకు చాలా ముఖ్యం. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఆ సమయంలో నొప్పి, ఇబ్బందులు, పీసీఓడీ లాంటి గైనిక్ సమస్యలను నివారిస్తుంది. హార్మోన్ల అసమతౌల్యం తగ్గుతుంది. కటి, తొడ భాగంలోని కండరాల పనితీరు మెరుగవుతుంది. శరీర ఆకృతి బాగుంటుంది. మొదట్లో కొద్దిగా కష్టమనిపిస్తుంది కానీ నెమ్మదిగా ఒక్కో భంగిమ తేలిగ్గా వచ్చేస్తుంది.
ఎలా చేయాలంటే...
1. రెండు కాళ్లూ ముందుకు జాపి కూర్చోవాలి.
2. తర్వాత కుడికాలును లోపలికి మడిచి ఎడమ కాలును ముందు నుంచి పక్కకు పెట్టుకోవాలి. ఎంత వరకూ పక్కకు వస్తే అంత వరకు పెట్టాలి.
3. వెన్నెముక నిటారుగా ఉంచి రెండు చేతులూ పైకి తీసుకొచ్చి శ్వాస వదులుతూ ఎడమ వైపు వంగాలి.
4. మెల్లగా వంగుతూ రెండు చేతులూ కాలి వేళ్లను పట్టుకోవడానికి ప్రయత్నించాలి.
5. మొదట్లో రెండు చేతులూ అలా ఆనకపోతే ఒక చేత్తో పట్టుకోవచ్చు. క్రమంగా రెండు చేతులూ అందుతాయి. ఆ స్థితిలోకి వెళ్లిన తర్వాత ఎంతసేపు ఆగగలిగితే అంతసేపు శ్వాస నిలుపు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేయాలి. ఇలా మూడుసార్లు ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపే ఉండండి. శ్వాస వదులుతూ వెళ్లాలి. శ్వాస ఆపాలి. శ్వాస తీసుకుంటూ రావాలి- ఇదీ నియమం.
ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్లు చేయాలి. అంటే అందరి శరీరమూ ఒకలా ఉండదు. దానికి అనుగుణంగా చేయాలి. కాస్త సేదతీరి ఇలానే కుడి కాలిని పక్కకు పెట్టి కుడివైపు వంగి చేయాలి. ఈ ఆసనం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. పెల్విక్ మొత్తం ఓపెన్ అవుతుంది. రక్త సరఫరా బాగుంటుంది. అన్ని అవయవాలకూ మంచిది. తుంటి దగ్గర తేలిగ్గా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.