వెళ్లలేను... ఉండలేను...

మా పెళ్లై తొమ్మిదేళ్లయ్యింది. అతనికిది రెండో పెళ్లి. మంచి ఉద్యోగమని అతని గురించి తెలుసుకోకుండానే పెళ్లి చేశారు. నాకు ముగ్గురు ఆడపడుచులున్నారు. వాళ్లు ఉన్నవీ లేనివీ నామీద కల్పించి మావారికి చెప్పి తిట్టిస్తుంటారు.

Updated : 11 Jul 2022 12:57 IST

మా పెళ్లై తొమ్మిదేళ్లయ్యింది. అతనికిది రెండో పెళ్లి. మంచి ఉద్యోగమని అతని గురించి తెలుసుకోకుండానే పెళ్లి చేశారు. నాకు ముగ్గురు ఆడపడుచులున్నారు. వాళ్లు ఉన్నవీ లేనివీ నామీద కల్పించి మావారికి చెప్పి తిట్టిస్తుంటారు. అవన్నీ విని నన్ను బయటి వ్యక్తిలా చూస్తాడతను. ఆ క్షణంలో చనిపోవాలనిపించినా, బాబు భవిష్యత్తు గుర్తొచ్చి ఆ ఆలోచనని విరమించుకుంటున్నా.  విడాకులు తీసుకునే ధైర్యం లేదు. నేనంటే బాబుకు చాలా ప్రేమ. నా కన్నీళ్లు తుడుస్తాడు. మా ఆడపడుచుల వల్లే గొడవలవుతున్నాయని ఇంత చిన్న వయసులోనే గ్రహించి కోపం చూపడంతో వాళ్లు దూరమయ్యారు. ఇదంతా నీవల్లేనంటూ మళ్లీ హింస. ఎంబీఏ చదివా. వెంటనే పెళ్లవడంతో ఉద్యోగం చేయాలన్నా బెరుకే. బయటికెళ్లే తెగువలేదు, ఈ నరకాన్నీ భరించలేను. పరిష్కారం సూచించండి!

- ఓ సోదరి

సమస్య మీవారికంటే కూడా మీ ఆడపడచుల దగ్గరే మొదలవుతోందంటున్నారు. అలాంటప్పుడు వాళ్ల మాటలూ, ముభావాలూ పట్టించుకోవద్దు, జవాబివ్వొద్దు. మీ తల్లీకొడుకుల క్షేమం గురించే ఆలోచించండి. భర్తతో ఉంటూనే ఉద్యోగంలో చేరండి. మొదట ధైర్యం లేకపోయినా క్రమంగా అలవాటవుతుంది. మీమీద మీకు నమ్మకం ఏర్పడి, తృప్తి కలుగుతుంది. ఇలాంటి అంశాలు బాబు వరకూ వెళ్లకుండా చూసుకోవాలి. పసి మనసు గాయపడుతుంది. అంతేగానీ చావు పరిష్కారం కాదు. పిల్లవాడి దృష్ట్యా భర్తను వదిలేయడమూ సరికాదు. బాబు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునే వరకూ తల్లిదండ్రులు ఆలంబనగా నిలవాలి. ఎన్ని సమస్యలున్నా కలిసుండేందుకు ప్రయత్నించాలి. వినేట్లయితే సరైన సందర్భం చూసి మీ ఆలోచనలూ, ఆందోళనా మీవారికి వివరించండి. లేదంటే అతడికి నమ్మకమైన వ్యక్తితో మీ నిర్దోషిత్వాన్ని, మానసిక వ్యథను తెలియచెప్పండి. సమస్య పరిష్కారమౌతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్