పిల్లలు నాకన్నా ఎత్తుగా పెరగాలంటే?

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద పాపకి ఏడేళ్లు. ఎత్తు 104 సెం.మీ, బరువు 16 కిలోలు. చిన్న పాపకి నాలుగేళ్లు. ఎత్తు 84 సెం.మీ, బరువు 11 కిలోలు. వయసుకి తగ్గ ఎత్తు ఉన్నారా? నా ఎత్తు అయిదు అడుగులు, మావారి ఎత్తు 5’8’’

Updated : 21 Jul 2022 12:26 IST

మాకు ఇద్దరమ్మాయిలు. పెద్ద పాపకి ఏడేళ్లు. ఎత్తు 104 సెం.మీ, బరువు 16 కిలోలు. చిన్న పాపకి నాలుగేళ్లు. ఎత్తు 84 సెం.మీ, బరువు 11 కిలోలు. వయసుకి తగ్గ ఎత్తు ఉన్నారా? నా ఎత్తు అయిదు అడుగులు, మావారి ఎత్తు 5’8’’. పిల్లలు సరైన బరువుతో నాకంటే ఎత్తుగా పెరగాలంటే ఏం చేయాలో సూచించగలరు?

- ఓ సోదరి

ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ అధ్యయనం ప్రకారం తల్లిదండ్రుల సగటు ఎత్తుకంటే ఆడపిల్లల ఎత్తు 6.5 సెం.మీ. తక్కువగా, మగ పిల్లల ఎత్తు 6.5 సెం.మీ. ఎక్కువగా ఉంటుంది. ఆ లెక్కన మీ పిల్లల ఎత్తు 5’2’’ వరకూ పెరగొచ్చు. కానీ ప్రస్తుతం ఇద్దరూ ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఎత్తు, బరువు ఉన్నారు. పుట్టినప్పట్నుంచీ  ఇలానే ఉన్నారా? వారి ఎదుగుదల ఎలా ఉందన్న విషయాన్ని పిల్లల వైద్యుడితో సమీక్షించుకోండి. మీ పిల్లలు చదువుల్లో, ఆటపాటల్లో చురుగ్గా ఉన్నారో లేదో చూడండి. ఒకవేళ లేకుంటే వైద్యులకు చూపించాలి. హార్మోన్ల అసమతౌల్యం కారణంగానూ ఇలా జరగొచ్చు. సాధారణంగా మన ఎత్తుపైన జన్యువులు, ఆహారం, వ్యాయామం, నిద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎముకల తయారీ, ఎదుగుదలలో మాంసకృత్తులు, ఖనిజాలూ, విటమిన్ల పాత్ర ఎక్కువ. ఇది సంపూర్ణ సమీకృత ఆహారంతోనే సాధ్యం. ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం, మెగ్నీషియం, జింక్‌, బోరిన్‌, విటమిన్‌ ఎ, బి ఇవన్నీ అందాలి. కండరాలన్నీ చురుగ్గా కదిలేలా వ్యాయామం చేయాలి. మీ పిల్లల వయసు చిన్నదే కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి సమయం ఉంది. వీరికి ముందు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి. కేవలం వరి కాకుండా రాగి, జొన్న, సజ్జ, గోధుమ.. వీటన్నింటితో చేసిన ఆహారం అందించాలి. పాలు, గుడ్లు, సోయా, పప్పు దినుసులు, నట్స్‌, మాంసాహారులైతే మాంసాహారం అందించాలి. చక్కెర పదార్థాలు తగ్గించండి. మొలకెత్తిన రాగులు, గోధుమలతో లడ్డూ, చపాతీ లాంటివి పెట్టండి. ఇడ్లీ, దోశ ఇవ్వండి. పండ్లు ఎక్కువగా అందించండి. బాస్కెట్‌బాల్‌, స్విమ్మింగ్‌, యోగా లాంటి స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయించండి. జీర్ణక్రియ సక్రమంగా లేకుంటే డాక్టర్‌ని సంప్రదించండి. అంతా సవ్యంగా ఉంటే కొన్ని నెలల్లో మార్పు కన్పిస్తుంది. ఆ తర్వాత అవసరమైతే పోషకాహార నిపుణుల సలహాతో న్యూట్రిషన్‌ సప్లిమెంట్స్‌ ఇవ్వొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్