ఇల్లు అమ్ముతానంటే మేనత్త అడ్డుపడుతోంది!
నాకు 18 ఏళ్లు. నాన్న 2012లో, అమ్మ 2016లో చనిపోయారు. అప్పట్నుంచి అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉంటూ చదువుకుంటున్నా. నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా వచ్చిన మూడు సెంట్ల ఇల్లు ఉంది. నాన్నకి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. వాళ్లలో
నాకు 18 ఏళ్లు. నాన్న 2012లో, అమ్మ 2016లో చనిపోయారు. అప్పట్నుంచి అమ్మమ్మ వాళ్ల దగ్గర ఉంటూ చదువుకుంటున్నా. నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా వచ్చిన మూడు సెంట్ల ఇల్లు ఉంది. నాన్నకి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. వాళ్లలో ఒక అక్క ఇల్లు, మా ఇంటి మధ్య గోడే అడ్డు. ఆ ఇళ్లు ఇప్పుడు పాతవైపోయాయి. మేము అమ్ముకుందాం అంటే అత్తయ్య ఒప్పుకోవడం లేదు. ఆ ఇంటి కాగితాలు మా దగ్గర లేవు. ఇప్పుడు అది నాకు రావాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి, విజయవాడ.
మీ నాన్నగారికి వాళ్ల నాన్న ద్వారా వచ్చిన ఇల్లు మీ నాన్నగారి పేరు మీద మారిందా? లేక వాళ్ల నాన్నగారి పేరుమీదే ఉందా? అనేది ముందు తెలుసుకోవాలి. మీ నాన్నగారి పేరు మీదకు రెవెన్యూ రికార్డ్స్‌లోకి మార్చి ఉంటే, అంటే పన్నులు, విద్యుత్ బిల్లు లాంటివి మీ నాన్న పేరు మీద ఉంటే ఆ ఇల్లు మీ నాన్నగారి తదనంతరం మీదే అవుతుంది. మీ మేనత్త మిమ్మల్ని అసలు ఎందుకు అమ్మనివ్వడంలేదు? ఆ ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఏమైనా ఉందా? భాగంగానీ ఆశించి మీకు అడ్డు పడుతున్నారా?.. ఇవి తెలియాలి. ముందుగా ఆ ఇంటి నంబరు మీద ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ తీయించండి. రిజిస్ట్రేషన్ల విభాగం దీన్ని ఇస్తుంది. అప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో తెలుస్తుంది. మీ అమ్మానాన్నలకు మీరే లీగల్ హేర్ అన్నట్లుగా నిరూపించే పత్రం ఒకటి తీసుకోవాలి. మీ నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగం చేసుంటే కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ ఇస్తారు. దాంతో కోర్టులో మీరే అసలైన వారసురాలని నిరూపించుకోవడానికి లీగల్ హేర్ డిక్లరేషన్ సూట్ వేయాల్సి ఉంటుంది. మీ తాతగారి ఆస్తికి సంబంధించిన కాగితాలు ఉంటే దాని ద్వారా ప్రయత్నించవచ్చు. లేదంటే ఇంటి నంబరు పెట్టి మీ వారసత్వ ధ్రువీకరణ పత్రం చూపించి మీ అత్తయ్య అన్యాయంగా మీ ఆస్తి మిమ్మల్ని అనుభవించకుండా అడ్డుపడుతున్నారని ఇంజక్షన్ సూట్ వేయండి. ముందుగా మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించండి. లేదంటే లీగల్ నోటీసు ఇవ్వండి. వారి జవాబు చూసుకొని మీ ఆస్తి దక్కించుకోవడానికి కోర్టులో దావా వెయ్యొచ్చు. అమ్మడానికి అడ్డు పడుతున్నారని క్రిమినల్ కేసు కూడా వేయొచ్చు. ఎవరైనా లాయర్‌ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.