కలవాలంటే భయం.. కళ్లలోకి చూడాలంటే దడ
నేను ఎన్నో ఏళ్ల నుంచి ఐ కాంటాక్ట్ ఫోబియాతో బాధపడుతున్నాను. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. నేను ఎవరి కళ్లలోకీ చూడలేను. చూస్తే కళ్లు మండిపోతున్నట్టు ఉంటుంది. అందుకే భయం.
నేను ఎన్నో ఏళ్ల నుంచి ఐ కాంటాక్ట్ ఫోబియాతో బాధపడుతున్నాను. దీన్నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదు. నేను ఎవరి కళ్లలోకీ చూడలేను. చూస్తే కళ్లు మండిపోతున్నట్టు ఉంటుంది. అందుకే భయం. కొన్నిసార్లు చనిపోవాలన్న ఆలోచనా వస్తుంది. ఉద్యోగం చేస్తున్నా. రోజూ నరకమే. కంటి వైద్యుణ్ని సంప్రదిస్తే సమస్యేమీ లేదన్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరి దగ్గరికీ వెళ్లను, ఎవరితోనూ మాట్లాడను. నన్నూ, నా పిల్లల జీవితాన్ని కాపాడండి.
- ఓ సోదరి
* మీది ఇతరులతో కలుపుగోలుగా ఉండలేని, మనసు విప్పి మాట్లాడలేని వ్యక్తిత్వం అని అర్థమవుతోంది. బహుశా మీ కుటుంబ సభ్యులు కూడా నలుగురితో కలిసిపోయేలా ప్రోత్సహించి ఉండరు. అందుకే ఇతరులను చూస్తే భయపడుతున్నారు. అవతలి వ్యక్తుల కళ్లలోకి చూసి మాట్లాడటం, అవసరమైనప్పుడు దీటుగా సమాధానం ఇవ్వడం, ఉద్వేగాలను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు ప్రతిస్పందించడం, భయమూ బెరుకూ లేకపోవడం, సహనం- ఇవన్నీ సామాజిక నైపుణ్యాల్లో ముఖ్యమైనవి. మీలో కలివిడితనం లేనందున ఎదుటివారి కళ్లలోకి చూసేందుకు ఆందోళన చెందుతున్నారు. దీన్ని సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ అంటారు. భయంతో కళ్లు బిగపట్టడం వల్ల మంటగా అనిపించవచ్చు. దీనికి పరిష్కారం లేదనుకుని చనిపోవాలనుకుంటున్నారు. కానీ పరిష్కారం ఉంది. మానసిక వైద్యులు రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్పిస్తారు. సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్, సోషల్ స్కిల్ ట్రైనింగ్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలతో ఉపశమనం లభిస్తుంది. అవసరమైతే మందులు సూచిస్తారు. కనుక మీరు సైకియాట్రిస్టును సంప్రదించండి, సమస్య పరిష్కారమౌతుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.