అమ్మమ్మ ఆస్తి... పెద్దమ్మ రాయించుకుంది!

అమ్మమ్మకు నలుగురు కూతుళ్లు. భర్తద్వారా వచ్చిన ఇంటిని నలుగురికీ సమానంగా పంచుతూ విల్లు రాసింది. తర్వాతెప్పుడో పెద్ద కూతురు దుర్బుద్ధితో చెల్లెళ్లకు తెలియకుండా తన పేరిట ఆ ఇంటిని రిజిస్టర్‌ చేయించుకుంది. విషయం

Published : 02 Aug 2022 01:06 IST

అమ్మమ్మకు నలుగురు కూతుళ్లు. భర్తద్వారా వచ్చిన ఇంటిని నలుగురికీ సమానంగా పంచుతూ విల్లు రాసింది. తర్వాతెప్పుడో పెద్ద కూతురు దుర్బుద్ధితో చెల్లెళ్లకు తెలియకుండా తన పేరిట ఆ ఇంటిని రిజిస్టర్‌ చేయించుకుంది. విషయం తెలిశాక మిగతా ముగ్గురూ కోర్టులో పార్టిషన్‌ దావా వేశారు. అమ్మమ్మ, మోసానికి పాల్పడిన పెద్దకూతురు చనిపోయారు. ఈ ముగ్గురూ వృద్ధాప్యంలో 70 ఏళ్లు దాటాకా 12 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అయినా ప్రయోజనం లేదు. సత్వర న్యాయానికి మార్గమేదైనా ఉంటే చెప్పగలరు. 

 - ఓ సోదరి

ఇలాంటి సమస్యలవల్లే కోర్టుల చుట్టూ తిరగకుండా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోమని సుప్రీం కోర్టు కూడా చెబుతోంది. అయినా సరే కడుపునిండిన వాళ్లు తొందరగా దారికి రారు. మీ అమ్మమ్మగారు రాసిన విల్‌ ఉండగా పెద్ద కూతురు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నప్పుడు దాన్ని మీరు ఏ కోర్టులో అయినా ‘క్యాన్సిలేషన్‌ ఆఫ్‌ రిజిస్టర్డ్‌ డీడ్‌’ కోసం వేసి ఉండాల్సింది. మీ అమ్మమ్మగారు ఉన్నప్పుడే సమస్య పరిష్కరించుకుంటే బావుండేది. పెద్ద కూతురు ఇంటిని తన పేరు మీద ఎలా రిజస్టర్‌ చేయించుకుంది? విల్‌ అయితే అమ్మమ్మగారి తదనంతరమే వస్తుంది. గిఫ్ట్‌ గానీ, సేల్‌ డీడ్‌ గానీ చేయించుకుంటే అది మోసపూరితంగా జరిగింది కాబట్టి క్యాన్సిల్‌ చేయమని కోర్టును కోరుతూ దావా వేసి ఉండొచ్చు. లేదంటే మీ అమ్మమ్మ గారి చేత వేయించి ఉండొచ్చు. రెండూ కాకుండా పార్టిషన్‌ కోసం ఎలా వేస్తారు? అమ్మమ్మగారి ఆస్తి ఆవిడకు స్వార్జితం అవుతుంది. తనకు ఇష్టం వచ్చినవారికి ఇవ్వొచ్చు. దానిలో పార్టిషన్‌ అడగడానికి మీకు హక్కు లేదు. ఇల్లు మీ తాతగారి పేరుమీద ఉంటే పార్టిషన్‌ వేయొచ్చు. కానీ అప్పుడు మీ అమ్మమ్మగారికి వీలునామా రాసే హక్కు లేదు. పార్టిషన్‌ సూట్‌ కరెక్ట్‌ కాదనిపిస్తోంది. సివిల్‌ కోర్టులో ప్రాపర్టీకి సంబంధించిన దావాలు 10-12 ఏళ్లు పడుతున్నాయి. అందుకు సవాలక్ష కారణాలు.. కక్షిదారులూ, లాయర్లూ తొందరగా అయిపోవాలి అనుకుంటేనే ముందుకు జరుగుతాయి. ఎవరిమీద దావా వేశారో వాళ్లని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడటానికి ప్రయత్నించండి. ప్రతివాదులు ముందుకు వచ్చి పరిష్కారం చేసుకోవడానికి సిద్ధపడితే తొందరగా అవుతుంది. కోర్టులు కూడా సీనియర్‌ సిటిజన్ల కేసులు త్వరగా తేల్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. న్యాయం జరగడమనేది మీరు పెట్టిన కేసుకు సంబంధించిన కాగితాల మీద ఆధారపడి ఉంటుంది. కేసు ఏ దశలో ఉందో తెలిస్తే ఇంకెన్నాళ్లు పడుతుందో చెప్పొచ్చు. మీ లాయర్‌ గారితో తొందరగా అయిపోవడానికి ప్రయత్నించమని చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని